అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kodada Road Accident | హైదరాబాద్–విజయవాడ Vijayawada జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. దొరకుంట సమీపంలో రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీ బలంగా కొట్టింది.
లారీలో భారీ ఇనుప కడ్డీలు ఉండటంతో ఢీకొన్న సమయంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
Kodada Road Accident | పలువురికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో సుమారు 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Kodada Road Accident | భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం
ప్రమాదం కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో కొంతసేపు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ప్రమాదంపై దర్యాప్తు
ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? లేదా రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను గుర్తించడంలో విఫలమయ్యారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.