Congress 1000 Days Rule | కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలన.. రైతుల్లో అసంతృప్తి

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో వెయ్యి రోజులు పూర్తి అవుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress 1000 Days Rule | రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో వెయ్యి రోజులు పూర్తి అవుతోంది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలనపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అధికారంలోకి రాకముందు కాంగ్రెస్​ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. రైతు భరోసా (Rythu Bharosa) ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోగా.. కొత్తగా ఇబ్బందులు రావడంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రతి విషయంలో గత బీఆర్​ఎస్​ పాలనతో పొల్చుకుంటూ కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నారు.

Congress 1000 Days Rule | అసలుకే ఎసరు

కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసింది. అయితే రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్నవారికి ఎలాంటి మాఫీ రాలేదు. ఎన్నికల సమయంలో అందరికి రూ.రెండు లక్షల లోన్​ మాఫీ చేస్తామని చెప్పి.. మోసం చేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా ఎకరాకు 15 వేలు ఇస్తామని కాంగ్రెస్​ చెప్పింది. అయితే మధ్యలో రెండు సీజన్లు రైతు భరోసా ఇవ్వలేదు. ఒక సీజన్​లో రెండు ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు. ఐదు సీజన్లలో రెండు సార్లు మాత్రమే సకాలంలో రైతు భరోసా జమ చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆపి మారి రైతు భరోసా ఇచ్చారని రేవంత్​రెడ్డి పాలనను రైతులు పోల్చుకుంటున్నారు.

Congress 1000 Days Rule | బోనస్​ పేరిట మోసం

కాంగ్రెస్​ ప్రభుత్వం బోనస్ (Paddy Bonus)​ పేరిట మోసం చేసిందని రైతులు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు బోనస్​ ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక సన్నాలకు మాత్రమే ఇస్తామన్నారు. అందులో 34 రకాలకు మాత్రమే ఇస్తామని తెలిపారు. తాజాగా వాటిని ఏడు రకాలకు తగ్గించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీజన్​లో వరినార్లు పోసిన తర్వాత ప్రభుత్వం ఏడు రకాలకు మాత్రమే బోనస్​ ఇస్తామని చెప్పింది. దీంతో ఇతర రకాలు సాగు చేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందే చెప్పిఉంటే తాము కూడా అవే రకాలు వేసే వాళ్లమని పేర్కొంటున్నారు. మరోవైపు బోనస్​ కూడా ఒక సీజన్​కే ఇస్తున్నారు. వానాకాలంలో బోనస్​ ఇస్తున్న ప్రభుత్వం.. యాసంగిలో ఆ మాట ఎత్తడం లేదు. దీంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు. రెండు సీజన్లకు బోనస్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు.

Congress 1000 Days Rule | యూరియా కోసం అవస్థలు

రాష్ట్రంలో యూరియా (Urea) కోసం రైతులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. యాప్​ ద్వారా బుకింగ్​ తీసుకొచ్చారు. అయితే చాలా మంది రైతులకు బుక్ చేసుకోవడం రావడం లేదు. మరోవైపు రైతులు అవసరం అయినంత స్టాక్​ సరఫరా కావడం లేదు. ఫలితంగా యాప్​లో స్టాక్​ అప్​లోడ్​ చేయగానే.. క్షణాల్లో అయిపోతుంది. చదువుకున్న వారు, స్మార్ట్​ఫోన్లు వాడటం తెలిసివారే యూరియా బుక్​ చేసుకోలేకపోతున్నారు. ఇక చదువు రాని పరిస్థితి చెప్పలేం. నిత్యం ఇతరుల వద్దకు వెళ్లి యూరియా బుక్ చేయమని చెబుతున్నారు. అయితే ఎప్పుడు స్టాక్​ వస్తుందో తెలియక అన్ని పనులు మానుకొని యూరియా కోసం తిరుగుతున్నారు. అయినా వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు.

 దీనిని చదవండి: SI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

Congress 1000 Days Rule | కొనుగోళ్లలో జాప్యం

రాష్ట్రంలో గత యాసంగి సీజన్​లో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరిగింది. ఆరుగాలం శ్రమించి, అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాశారు. ధాన్యం కుప్పల వద్ద పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. అయినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు.

Congress 1000 Days Rule | సరిచేసుకోకపోతే కష్టమే..

ప్రస్తుతం మెజారిటీ రైతుల్లో కాంగ్రెస్​ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎరువుల ధరలు పెరగడం, యూరియా దొరకకపోవడంపై అసంతృప్తితో ఉన్న రైతులు.. కాంగ్రెస్​ పాలన పోతే మళ్లీ తమకు కష్టాలు తీరుతాయని చర్చించుకుంటున్నారు. ఎరువుల ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా.. రైతులు మాత్రం కాంగ్రెస్​ తీరుపైనే అసంత​ప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సీఎం రేవంత్​రెడ్డి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా సమయానికి వేయడం, వడ్లు కొనుగోళ్లు వేగంగా చేపట్టడం చేస్తే కొంత వరకు పాజిటివిటి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఈ వీడియో చూడండి : https://www.youtube.com/watch?v=SMrivuVxiUI&t=114s

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *