అక్షరటుడే వెబ్‌డెస్క్: Kodangal Development | ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) శనివారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి, కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విద్య, వైద్యం, ప్రజా సౌకర్యాలు, మౌలిక వసతులు అనే నాలుగు కీలక రంగాలకు ఒకేసారి పెద్దపీట వేయడంతో కొడంగల్ అభివృద్ధిలో దూసుకెళ్తోంది.
Kodangal Development | ఆధునిక పాఠశాలలు..
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కొడంగల్, కోస్గి పట్టణాల్లో రూ.12 కోట్ల సీఎస్‌ఆర్ (CSR) నిధులతో నిర్మించిన కార్పొరేట్ స్థాయి పాఠశాల భవనాలు అందుబాటులోకి వచ్చాయి. అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో కొడంగల్‌లో రూ.8 కోట్లతో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల నూతన భవనాలను నిర్మించారు. అలాగే కోస్గిలో రూ.4 కోట్లతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని పూర్తి చేశారు. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ బడులు విద్యార్థులకు చక్కటి వాతావరణాన్ని అందించనున్నాయి.
Kodangal Development | రూ.5 కే భోజనం..
కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.27 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను సీఎం ప్రారంభించి, వైద్య సేవలను పరిశీలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో చికిత్స అందేలా, అత్యవసర వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన కష్టాలు తప్పేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకుల కోసం హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇందిరమ్మ క్యాంటీన్’ను ప్రారంభించి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు. ఈ క్యాంటీన్‌లో కేవలం రూ.5 కే రుచికరమైన భోజనం అందించనున్నారు.
Kodangal Development | ఆర్‌అండ్‌బీ అతిథి భవనం..
అధికారిక కార్యక్రమాలు, ఉన్నతాధికారుల పర్యటనల కోసం కొడంగల్‌లో రూ.8.51 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన ఆర్‌అండ్‌బీ అతిథి భవనం ప్రారంభమైంది. ఇందులో నిర్మాణ పనులకు రూ.6.80 కోట్లు, ఫర్నిచర్‌కు రూ.1.71 కోట్లు వెచ్చించారు. ఒకే రోజు రూ.12 కోట్లతో విద్యా వసతులు, రూ.27 కోట్లతో క్రిటికల్ కేర్, రూ.8.51 కోట్లతో అతిథి భవనం, ఆసుపత్రిలో రూ.5కే భోజనం వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో కొడంగల్‌లో కొత్త ఊపు వచ్చింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: KTR | రాష్ట్రానికో రంగు మారుస్తున్న రాహుల్ గాంధీ : కేటీఆర్