అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Municipal Blackmail Scam | నిజామాబాద్ నగరంలో ‘రూల్స్ అండ్ రెగ్యులేషన్స్’ పేరుతో సాగుతున్న ఒక భారీ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్లాన్ పర్మిషన్లు, భవన నిబంధనల పేరుతో భవన యజమానులను, ప్రత్యేకించి ప్రైవేట్ క్లినిక్‌లు, ఆసుపత్రులు నడిపే వైద్యులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న తీవ్ర వేధింపుల పర్వం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వ్యవహారాలను ఆసరాగా చేసుకుని ‘హాసన్’ అనే వ్యక్తి సాగిస్తున్న బ్లాక్‌మెయిలింగ్ దందా ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.
Nizamabad Municipal Blackmail Scam | వేధింపుల వ్యూహం
నగర పరిధిలో కొత్తగా నిర్మించే వాణిజ్య భవనాలు, క్లినిక్‌లు, ఆసుపత్రుల నిర్మాణ లోపాలను వేదికగా చేసుకుని ఈ నెట్‌వర్క్ పనిచేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. రోజువారీ సేవల్లో బిజీగా ఉండే వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాల వద్దకు వెళ్లి భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగడం, అధికారులకు ఫిర్యాదు చేస్తామని మానసిక ఒత్తిడికి గురిచేయడం పరిపాటిగా మారింది.
Nizamabad Municipal Blackmail Scam | నిరంతరం భయం గుప్పెట్లో ఉంచుతూ..
భవనాలపై చర్యలు తీసుకోకుండా ఉండాలన్నా.. విచారణలు ఆపాలన్నా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. నిరంతరం భయం గుప్పెట్లో ఉంచుతూ డబ్బులు గుంజే ఈ క్రమంలోనే.. హాసన్ అనే వ్యక్తికి సంబంధించిన ఆధారాలు, ఫొటోలు ప్రత్యక్షంగా బయటపడటంతో బాధితులు ఉపశమనం పొందుతుండగా.. ఈ బ్లాక్‌మెయిల్ రాయుడి తీరుపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Nizamabad Municipal Blackmail Scam | కార్పొరేషన్ యంత్రాంగం ఏం చేస్తోంది?
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతులు, నిబంధనల పరిశీలన అనేది అధికారికంగా జరగాల్సిన ప్రక్రియ. కానీ, ప్రైవేట్ వ్యక్తులు, మధ్యవర్తులు అధికారుల పేర్లు వాడుకుంటూ.. క్షేత్రస్థాయిలో భవన యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తుంటే టౌన్ ప్లానింగ్ వర్గాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగా భవనాల్లో ఉల్లంఘనలు ఉంటే మున్సిపల్ చట్టాల ప్రకారం అధికారులు నోటీసులు ఇవ్వాలి తప్ప, ఇలాంటి వ్యక్తుల చేతికి బ్లాక్‌మెయిల్ అస్త్రాన్ని ఎలా ఇస్తారని నగర వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
Nizamabad Municipal Blackmail Scam | కఠిన చర్యలు అవసరం
వైద్యులు, వ్యాపారులు, భవన యజమానులను భయపెట్టి నిధులు గుంజుతున్న ఇలాంటి వారిపై పోలీసులు, మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ‘హాసన్’ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి, ఈ బ్లాక్‌మెయిలింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Dc51FUotwtC/?igsi=MTc0Z2FrcTFnMmliNA==