అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Speaker Meeting | తెలంగాణ శాసనసభలో సోమవారం నెలకొన్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ( Gaddam Prasad Kumar )ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సభ ప్రారంభానికి ముందే నేరుగా స్పీకర్ వద్దకు వెళ్లిన ఇద్దరు అగ్రనేతలు.. అసెంబ్లీలో జరిగిన ఘటనలపై తీవ్ర విచారం, ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌ను ఓదార్చి, ప్రభుత్వ పరంగా సంపూర్ణ అండదండలు ఉంటాయని భరోసానిచ్చారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Revanth Reddy Speaker Meeting | తొలిరోజే రణరంగం..
సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజునే సభావరణంలో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నల్ల టీ-షర్టులు ధరించి ఆందోళనకు దిగిన హరీష్ రావు, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో తీవ్ర వాగ్వాదం, తోపులాటకు దిగారు. ఈ క్రమంలో కొందరు నేతలు దుస్తులు తొలగించి మరీ నిరసన తెలపడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Revanth Reddy Speaker Meeting | అనుచిత పదజాలంతో..
బీఆర్ఎస్ నేతలు అనుచిత పదజాలంతో దూషించారని, ఆయనను, ఆయన కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ అధికార పక్షం తీవ్రంగా మండిపడింది. ఈ అవమానాన్ని తలచుకుని స్పీకర్ సభలోనే కంటతడి పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలతో తీవ్రంగా చలించిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేరుగా స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీయడంతో పాటు, ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేలా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: Seethakka Comments | స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలి: మంత్రి సీతక్క