అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana AICC In Charge | రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ అంతర్గత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జులతో పాటు ఐదారు రాష్ట్రాల పీసీసీ (PCC) అధ్యక్షులను మార్చేందుకు కసరత్తు వేగవంతం చేసింది.
Telangana AICC In Charge | లండన్ పయనంకానున్న మీనాక్షి నటరాజన్
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీనాక్షి నటరాజన్ స్థానంలో నూతన నేతను నియమించేందుకు అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోంది.
మీనాక్షి నటరాజన్ ఈ నెల 18న ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లనున్నారు. సుమారు పది నెలల పాటు ఆమె పార్టీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండనుండటంతో, రాష్ట్ర పార్టీ నిర్వహణ దెబ్బతినకుండా కొత్త నేతకు బాధ్యతలు అప్పగించనున్నారు.
Telangana AICC In Charge | రేసులో తమిళనాడు నేత ఎ. చెల్లకుమార్
తెలంగాణ కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా తమిళనాడుకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎ. చెల్లకుమార్ పేరును అధిష్ఠానం బలంగా పరిశీలిస్తోంది. గతంలోనూ పలు రాష్ట్రాల సమన్వయ బాధ్యతలను విజయవంతంగా చేపట్టిన అనుభవం ఉండటంతో, ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.