అక్షరటుడే, వెబ్‌డెస్క్: Adilabad RIMS Incident | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి చిన్నారుల వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఈ ఘటనలో ఐదు రోజుల శిశువు మృతి చెందగా, మరో 24 మంది చిన్నారులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Adilabad RIMS Incident | అర్ధరాత్రి సమయంలో పొగలు
రిమ్స్‌లోని ఎస్ఎన్సీయూ వార్డులో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఏసీ నుంచి పొగలు రావడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ చిన్నారులను తీసుకుని వార్డు నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి చిన్నారులను పక్క వార్డుకు తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రిమ్స్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఐదు రోజుల శిశువు మృతి చెందడంతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Adilabad RIMS Incident | ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు
మరో 24 మంది చిన్నారులను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కూడా ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.