TGEJAC Talks | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో TGEJAC చర్చలు విఫలం.. డిమాండ్లపై స్పష్టత కరవు.. రేపు అత్యవసర రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం!

TGEJAC ఆధ్వర్యంలో అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో అత్యవసర రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TGEJAC Talks | ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (TGEJAC) ప్రతిపాదించిన నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండానే ముగిశాయని TGEJAC ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు.

TGEJAC Talks | అప్పుడు సీఎస్​ హామీతోనే వాయిదా..

సచివాలయంలో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజూతో TGEJAC నేతలు సమావేశమయ్యారు. గత మే 2న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబరు 10న నిర్వహించాల్సిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు వాయిదా వేసినట్లు వారు గుర్తుచేశారు. అనంతరం రెండు రోజులుగా సమావేశం వాయిదా పడుతూ, చివరకు సచివాలయంలో చర్చలు జరిగాయని తెలిపారు.

అయితే, TGEJAC ప్రధానంగా లేవనెత్తిన నాలుగు డిమాండ్లలో ఏ ఒక్క అంశంపైనా స్పష్టమైన నిర్ణయం, కాలపరిమితి ప్రకటించలేదని నాయకులు పేర్కొన్నారు. దీంతో సమావేశం జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

TGEJAC Talks | DAపై ప్రతిపాదన మాత్రమే

డీఏ (DA) విషయంలో దసరాకు ఒక డీఏ, ఉగాదికి మరో డీఏ ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపినట్లు TGEJAC నేతలు వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించి కేబినెట్‌కు ప్రతిపాదన మాత్రమే చేస్తామని చెప్పినట్లు తెలిపారు.

పెండింగ్‌ బిల్లుల విషయంలో గతంలో మాదిరిగా నెలకు రూ.2,000 కోట్ల విలువైన బిల్లులు చెల్లించాలని TGEJAC కోరింది. అయితే ప్రస్తుతం నెలకు సుమారు రూ.1,000 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు చేయగలమని ప్రభుత్వం తెలిపినట్లు నేతలు వెల్లడించారు.

TGEJAC Talks | PRCపై కాలపరిమితి లేదు

పే రివిజన్‌ కమిషన్‌ (PRC) నివేదిక విషయంలోనూ స్పష్టత రాలేదని TGEJAC నేతలు తెలిపారు. నివేదికను ఇప్పటివరకు తెప్పించలేదని, ఒకటి లేదా రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొన్నట్లు చెప్పారు. నివేదిక వచ్చిన అనంతరం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు.

RIMS Accident | రిమ్స్‌ ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య.. మరో 20 మంది నవజాత శిశువుల పరిస్థితి విషమం!

TGEJAC Talks | CPSపై కూడా స్పష్టత కరవు

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (CPS)పై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపినప్పటికీ.. కమిటీ ఏర్పాటు, నివేదిక సమర్పణకు ఎలాంటి కాలపరిమితిని వెల్లడించలేదని TGEJAC నేతలు తెలిపారు. ముఖ్యంగా 01-09-2004 నాటికి నియమితులైన ఉద్యోగుల విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు.

రేపు అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశం

నాలుగు ప్రధాన అంశాలపై స్పష్టమైన నిర్ణయం, కాలపరిమితి లేకపోవడంతో ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమైనట్లుగా భావిస్తున్నామని TGEJAC చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు.

తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు రేపు TGEJAC ఆధ్వర్యంలో అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో అత్యవసర రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని TGEJAC నాయకులు స్పష్టం చేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *