అక్షరటుడే వెబ్డెస్క్: ECI SIR Hearing | కేంద్ర ఎన్నికల సంఘంలో (ECI) ఇటీవల ఉన్నతాధికారుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో ఈసీ వర్గాల్లో అత్యవసర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు సీఈసీ జ్ఞానేష్ కుమార్తో ( Gyanesh Kumar ) పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి అత్యవసరంగా సమావేశమయ్యారు.
ECI SIR Hearing | అత్యవసర భేటీ..
కమిషన్ పరిధిలోని అంతర్గత అంశాలు, ఇటీవల కమిషనర్ల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కమిషన్ పనితీరు ఎక్కడా తగ్గకుండా, భవిష్యత్తులోనూ సమర్థవంతంగా సాగేలా అధికారుల మధ్య సజావుగా సమన్వయాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.
ECI SIR Hearing | ఓటర్లకు ఊరట..
మరోవైపు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి సాధారణ ప్రజలు, ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఉపశమనం కల్పిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా ఈసీ నుంచి నోటీసులు అందుకున్న ఓటర్లు ధ్రువీకరణ పత్రాలు లేదా వివరాలు సమర్పించేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.
ECI SIR Hearing | ఓటర్లు ఇబ్బందులు పడకుండా..
నోటీసులు అందుకున్న ప్రతీ ఓటరు ఇంటికే నేరుగా బీఎల్వో (BLO)లే స్వయంగా వెళ్లేలా అధికారులను ఆదేశించింది. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. అధికారులే నేరుగా ఇళ్లకు వచ్చి అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలను పరిశీలించి సేకరిస్తారని తెలిపింది. అంతేకాదు, ఆ పత్రాలను వారే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని వెల్లడించింది. కార్యాలయాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఓటర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ సులభమైన మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ