అక్షరటుడే వెబ్‌డెస్క్: Khairatabad Bypoll | తెలంగాణ రాజకీయం మరోసారి తీవ్ర ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. వచ్చే రెండేళ్లలో అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఉపఎన్నిక అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ పోరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ( Kishan Reddy ) రాజకీయంగా మరో పెద్ద పరీక్షగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Khairatabad Bypoll | సొంత సెగ్మెంట్‌లో పరీక్ష..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే జాతీయ నాయకత్వం సునీల్ బన్సల్‌ను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమించింది. అయితే, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం కిందకే వస్తుంది. సొంత పార్లమెంట్ పరిధిలోనే ఉపఎన్నిక వస్తుండటంతో బీజేపీ గెలుపోటములు నేరుగా కిషన్ రెడ్డి రాజకీయ ప్రతిష్టతో ముడిపడి ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
Khairatabad Bypoll | జూబ్లీహిల్స్ అనుభవం ..
గతేడాది సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ ఎదుర్కొన్న పరాభవం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. 2025లో జరిగిన ఆ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓటింగ్ గణనీయంగా పడిపోయి పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. అప్పట్లో అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు అంతా కిషన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని, పార్టీలోని ఇతర సీనియర్ నేతలు సరిగ్గా సహకరించలేదనే విమర్శలు వచ్చాయి. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన సొంత సెగ్మెంట్‌లో పార్టీ ఓట్లు తగ్గడం అప్పట్లో కలకలం రేపింది.
Khairatabad Bypoll | అమిత్ షా పర్యటనపైనే అందరి చూపు..
ఇప్పుడు మళ్లీ అదే లోక్‌సభ పరిధిలో ఖైరతాబాద్ ఉపఎన్నిక రావడంతో కిషన్ రెడ్డి ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు రానున్న ఆయన.. కొత్త ఇన్‌చార్జ్‌లతో భేటీ అయి పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉపఎన్నికపై అమిత్ షా ఎలాంటి అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: AMCA Fighter Jet | హెచ్‌ఏఎల్‌కు భారీ షాక్.. ఏఎంసీఏ యుద్ధ విమాన ప్రాజెక్ట్ రేసు నుంచి ఔట్