Nizamabad Sessions Court | మహిళపై హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

మహిళపై హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Sessions Court | మహిళపై హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా (Nizamabad) సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించగా.. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.

Nizamabad Sessions Court | నగరంలోని బూరుడుగల్లీకి చెందిన..

సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు దిలీప్ తన తల్లి, భార్య పూజ, కుమార్తె, కుమారుడితో కలిసి బూరుడుగల్లీలో నివాసం ఉంటున్నాడు. తండ్రి మరణించడంతో వారసత్వ ప్రాతిపదికన నగర పాలక సంస్థలో కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన దిలీప్ తరచూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తన తల్లి, భార్యను వేధిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ విషయం గమనించిన పక్కింటి మహిళ రేషం లక్ష్మి దిలీప్‌ను పలుమార్లు మందలిస్తూ కుటుంబంతో బాగుండాలని సూచిస్తూ ఉండేది. ఈ క్రమంలో 2024 డిసెంబర్ 9న సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో దిలీప్ తన తల్లి, భార్యను వేధిస్తున్న సమయంలో రేషం లక్ష్మి అక్కడికి వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన దిలీప్ ఆమె గొంతు పిసికి హత్య చేసేందుకు యత్నించాడు. ఆమెపై దాడి చేయడంతో గాయాలపాలైంది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు.

Nizamabad Sessions Court | కొడుకును బ్లేడ్​తో గాయపర్చిన కేసు సైతం..

కేసును విచారించిన జిల్లా సెషన్స్ జడ్జి జీవీఎన్ భారత లక్ష్మి నిందితుడు జంబిలం దిలీప్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, వెయ్యి జరిమానా విధించారు. జరిమానా కట్టకపోతే మరో మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితుడిపై మరో నాలుగు క్రిమినల్ కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వాటిలో తన నాలుగేళ్ల కుమారుడిని బ్లేడ్‌తో గాయపరిచిన కేసు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి , సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించడంలో కృషి చేసిన బ్రీఫింగ్ ఆఫీసర్ ఎస్సై యాదగిరి, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎండీ యాసిర్ అరాఫత్, కోర్టు లైజన్ ఆఫీసర్ గోవింద్, సీఎంఎస్​ కోర్టు కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.

ఇది కూడా చదవండి: కనకదుర్గమ్మ ఆలయానికి నేచురల్​ సార్ట్​ నాని 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *