అక్షరటుడే వెబ్‌డెస్క్: Khairatabad Bypoll | ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2024లో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్ ఉపఎన్నిక నిర్వహించే ప్రక్రియను నిలిపివేయాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్నికల సంఘం (ఈసీఐ), దానం నాగేందర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
Khairatabad Bypoll | హైకోర్టు తీర్పు..
2023 శాసనసభా ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో విజయారెడ్డి, దానం నాగేందర్‌పై 22,010 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో దానం తన భార్య, ఆధారపడిన వారి ఆస్తులకు సంబంధించిన కీలక సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ విజయారెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని ప్రకటించి, ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
Khairatabad Bypoll | ఉపఎన్నిక నోటిఫికేషన్..
ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల అంశంలో దానం నాగేందర్ ( Danam Nagender ) ఎమ్మెల్యే పదవిపై తెలంగాణ హైకోర్టు వేటు వేసింది. హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతయ్య ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని పేర్కొంటూ గత శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో త్వరలోనే ఈ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలో విజయారెడ్డి తన పాత పిటిషన్‌పై మరోసారి కోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Khairatabad By-Election | ఖైరతాబాద్ బరిలో నిలిచేదెవరో.. తెరపైకి పీజేఆర్ కూతురు