అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khairatabad By-Election | ఖైరతాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్‌పై కోర్టు అనర్హత వేటు వేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. మళ్లీ తనకే టికెట్ వస్తుందని దానం ధీమాగా ఉండగా.. తనకు అవకాశం ఇవ్వాలని పీజేఆర్ కూతురు కోరుతున్నారు.
ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అంతేగాకుండా ఎంపీగా సైతం పోటీ చేసి ఓడిపోయారు. దీంతో హైకోర్టు (High Court) ఆయనపై అనర్హత వేటు వేసింది. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ కార్యాలయం సైతం ధృవీకరించింది. దీంతో 6 నెలల్లోపు అక్కడ ఉప ఎన్నిక రానుంది. కాంగ్రెస్ నుంచి మరోసారి తనకు టికెట్ ఇస్తారని దానం నాగేందర్ భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని ఆయన ఇప్పటకే పేర్కొన్నారు. అయితే ఇతరులు సైతం టికెట్ ఆశిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి.
Khairatabad By-Election | విజయారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
పి జనార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి సైతం ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ ఎంపీ అభ్యర్థి అని, తాను ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు. పీజేఆర్ బిడ్డకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పీజేఆర్ పేరు లేనిది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుకు వెళ్లలేదని చెప్పారు. దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాలకు పంపి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇతరులు సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందోన్న ఉత్కంఠ నెలకొంది.
Khairatabad By-Election | గత ఎన్నికల్లో ఓటమి
పీజేఆర్ మరణానంతరం విజయారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2014లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీఆర్ఎస్లో చేరారు. 2016లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచారు. అనంతరం 2018లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా రాలేదు. దీంతో మరోసారి 2019లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2022 జూన్ 18న ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఉప ఎన్నికల్లో బరిలో దిగి గెలవాలని భావిస్తున్నారు. ఇప్పటికే తను పోటీ చేస్తానని చెప్పడంతో ఆమె అనుచరులు క్షేత్రస్థాయిలో హడావుడి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Erravelli Land Survey | ఎర్రవల్లి భూ సర్వే పూర్తి.. నేడు ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనున్న కలెక్టర్