అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిరిసిల్లలో ( Sircilla ) పర్యటించిన సీఎం.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్య చేసుకున్న 35 మంది చేనేత కార్మికుల కుటుంబాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశించామని, కానీ సీఎం శత్రుదేశంపై దాడికి వెళ్లినట్లు వచ్చి కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
KTR Revanth Reddy | సవాల్ విసిరిన కేటీఆర్..
ఎన్నికల హామీల అమలును తమ పార్టీ గట్టిగా నిలదీస్తుండటంతో ప్రభుత్వం తమపై కక్షగట్టి మాట్లాడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన సీఎం తమ్ముడు ఏరోస్పేస్ కంపెనీ ఎలా పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను మాత్రం 2006లోనే హోటల్ వ్యాపారం ప్రారంభించానని, అది ఇప్పుడు మూడు హోటళ్లుగా విస్తరించిందని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ తాను ఎన్నికల అఫిడవిట్లలో పారదర్శకంగా వెల్లడించానని, వ్యాపారం చేయడం నేరమా అని నిలదీశారు.
KTR Revanth Reddy | సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం..
తమ కుటుంబంపై వస్తున్న నిరాధార ఆరోపణలను తిప్పికొడుతూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. “దమ్ముంటే మా కుటుంబ ఆస్తులతో పాటు మీ కుటుంబ ఆస్తులపై విచారణ జరిపించేందుకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జికి లేఖ రాయండి. సమగ్ర న్యాయ విచారణలో మాది తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా మేము సిద్ధం” అని తేల్చిచెప్పారు.
KTR Revanth Reddy | డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి..
ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలతో ప్రతిపక్షాన్ని బెదిరించలేరని, హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రజాక్షేత్రంలో నిరంతరం నిలదీస్తూనే ఉంటామని సీఎంను హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Danam Nagender Votes | హైదరాబాద్‌ను తగలబెడతాం.. దానం నాగేందర్ సంచలన హెచ్చరిక