అక్షరటుడే వెబ్డెస్క్: Harish Rao Rice Prices | తెలంగాణాలో ( Telangana )నిత్యావసర వస్తువుల ధరలను అణచివేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సామాన్యుడిపై విపరీతమైన భారం పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిద్రపోతోందని ఆయన మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సన్నబియ్యం ధరలు 25 శాతం మేర పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, దీనిపై వెంటనే సమీక్ష నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Harish Rao Rice Prices | నాణ్యత లేని బియ్యాన్ని ..
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి బియ్యం రేట్లు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం విజయవంతమైతే బహిరంగ మార్కెట్లో ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయని నిలదీశారు. ప్రభుత్వం ఇస్తున్న నాణ్యత లేని బియ్యాన్ని ప్రజలు తినడం లేదనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
Harish Rao Rice Prices | దళారుల గుప్పిట్లో లాభాలు..
రేయింబవళ్లు శ్రమించి పంట పండించే రైతన్నకు కనీస మద్దతు ధర (MSP) నామమాత్రంగానే దక్కుతోందని, కానీ మధ్యవర్తులు, దళారులు మాత్రం క్వింటాకు రూ. 8,000 పైగా లాభం పొందుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు, వినియోగదారుడికి అందుబాటు ధరలో వస్తువులు లభించడం లేదు.. కేవలం దళారులు మాత్రమే బాగుపడుతున్నారని మండిపడ్డారు.
Harish Rao Rice Prices | తారుమారవుతున్న బడ్జెట్..
కేవలం బియ్యం మాత్రమే కాకుండా.. ఉల్లిపాయలు కిలో రూ. 70, వెల్లుల్లి రూ. 240, పల్లీ నూనె రూ. 210, పెసరపప్పు రూ. 125, కందిపప్పు రూ. 165 ఇలా నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెరిగిపోతుంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. వంటింటి బడ్జెట్ పూర్తిగా తారుమారవుతున్నా పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోందని నిలదీశారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, సామాన్యులకు ధరల భారం నుంచి ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Rice Prices Rise | బియ్యం ధరలకు రెక్కలు.. సామాన్యులకు పట్టపగలే చుక్కలు..