అక్షరటుడే వెబ్‌డెస్క్: Lucknow Airport Fire |ఉత్తరప్రదేశ్‌లోని ( Uttar Pradesh ) లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల మంగళవారం ( అక్టోబర్ 6 ) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మూడు అంతస్తుల తాత్కాలిక వసతి గృహంలో ఉదయం సుమారు 6:50 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సులభంగా మంటలంటుకునే పీవీసీ (PVC) ప్యానెళ్లతో ఈ క్యాంప్‌ను నిర్మించడంతో.. అగ్నికీలలు నిమిషాల వ్యవధిలోనే మొత్తం భవనానికి వ్యాపించాయి. ఆకాశాన్ని తాకిన దట్టమైన పొగను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Lucknow Airport Fire | తప్పిన ప్రాణనష్టం..
ఈ తాత్కాలిక భవనంలో మొత్తం 33 గదులు ఉండగా, షిఫ్టుల వారీగా పనిచేసే దాదాపు 500 మంది కార్మికులు ఇందులో నివసిస్తున్నారు. ప్రమాదం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై లోపల ఉన్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ఎయిర్పోర్ట్ ఫైర్ ఇంజన్లు, లక్నో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మంటలు చెలరేగడానికి అసలు కారణం ఏంటనే దానిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Russia Drone Attack | రష్యా దాడిలో భారత నావికుడికి గాయాలు