Kavitha Vemulawada Issues | కాళేశ్వరం నీళ్లు ఏవి?.. వేములవాడ, సిరిసిల్ల సమస్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

వేములవాడ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Vemulawada Issues | వేములవాడ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన రూ.200 కోట్ల నిధులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని అన్నారు. ఎవరు నిధులు ఇచ్చినా సంతోషమేనని, అయితే ఆలయ నిర్మాణంలో కాంక్రీట్‌కు బదులుగా కృష్ణశిలను ఉపయోగించాలని ఆమె సూచించారు. రాజన్న ఆలయంలో కోడెలు మృతి చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి బండి సంజయ్ పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.

Kavitha Vemulawada Issues  | అద్భుతంగా అభివృద్ధి..

వేములవాడలోని రాజన్న చెరువు ప్రక్షాళన కోసం విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా నిధులు తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్లను అద్భుతంగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం వేములవాడ అభివృద్ధి బాధ్యతలు చూస్తున్న ఆది శ్రీనివాస్ నియోజకవర్గ సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టాలని, అధికార దర్పం కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని హితవు పలికారు. తన తల్లిదండ్రుల వివాహం కూడా వేములవాడలోనే జరిగిందని గుర్తుచేసిన కవిత.. ఈ ప్రాంతంతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని భావోద్వేగంగా చెప్పారు.

Kavitha Vemulawada Issues  | తీవ్ర విమర్శలు..

వేములవాడలో రోడ్లు, మార్కెట్లు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చేపట్టిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని కవిత ఆరోపించారు. రైతుల కోసం సరైన మార్కెట్ సౌకర్యం లేదని, పట్టణంలో దుమ్ము సమస్య వేధిస్తోందని తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Kavitha Vemulawada Issues  | కాళేశ్వరం నీటి హామీ ఏమైంది?

వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా రాలేదన్నారు. రుద్రంగి వద్ద రూ.200 కోట్లతో 2.5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మిస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జేఎన్‌టీయూ విద్యార్థులు ల్యాబ్ సౌకర్యాల కోసం జగిత్యాలకు వెళ్లే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు.

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్)ను ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేసిన తర్వాత కనీసం కరెంట్ పోల్ దెబ్బతిన్నా పట్టించుకునేవారు లేరని విమర్శించారు. సెస్ ఫైర్ ప్రమాదంలో నేరెళ్ల బాధితుల ఫైల్స్ కూడా కాలిపోయాయని, వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Kavitha Vemulawada Issues  | కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు..

సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి పదేళ్లు తానే సీఎంగా ఉంటానని అంటుంటే, మరోవైపు బీసీ సీఎంను చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారని.. ఈ పరిణామాలను చూస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడికి “విడాకులు అయ్యాయి” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో ముస్లిం జర్నలిస్టులతో సహా అందరికీ అక్రిడిటేషన్ విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

మాజీ మావోయిస్టులు టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చిన కవిత.. వారి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి:  ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *