అక్షరటుడే వెబ్‌డెస్క్: Rice Prices Telangana AP | తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చొన్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో 45 నుండి 50 రూపాయల మధ్య లభించిన సాధారణ రకం బియ్యం ధరలు.. ఇప్పుడు ఏకంగా 80 నుండి 90 రూపాయలకు దూసుకెళ్లాయి. గత ఏడాదితో పోలిస్తే కిలో బియ్యంపై రూ. 30 వరకు భారం పెరిగింది. రాబోయే రోజుల్లో మార్కెట్‌లో బియ్యం ధరలు సెంచరీ దాటి కిలో వంద రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
Rice Prices Telangana AP | ఎల్ నినో కారణం..
ఈ అనూహ్య ధరల పెరుగుదలకు ప్రధానంగా వరి దిగుబడి తగ్గిపోవడమే కారణమని కడప టౌన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాదర్ వెల్లడించారు. ఎల్ నినో తీవ్ర ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లో వరి సాగు గణనీయంగా పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం దిగుబడి దాదాపు 60 శాతం తగ్గి, కేవలం 40 శాతం మేర మాత్రమే పంట చేతికి వచ్చింది. దసరా పండుగ సమయానికి రైస్ మిల్లుల్లో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండేవి.. కానీ ఈసారి మిల్లుల్లో కనీస స్థాయిలో కూడా స్టాక్ లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Rice Prices Telangana AP | ప్రచారంలో నిజం లేదు..
కావాలనే బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ప్రచారాన్ని రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఖండించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం, ప్రొడక్షన్ ఛార్జీలు, రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఒక బస్తాపై తమకు దాదాపు రూ. 2000 వరకు ఉత్పత్తి వ్యయం అవుతోందని వివరించారు. మార్కెట్‌లో సరైన ధర రాక తాము కూడా నష్టాలు ఎదుర్కొంటున్నామని.. రాబోయే నెల రోజుల్లో బియ్యం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Rice Prices Telangana AP | ముందస్తు వరి కోతలు..
ఇదిలా ఉంటే.. ఉమ్మడి నిజామాబాద్ ( Nizamabad )జిల్లాలోని నిజామాబాద్, బోధన్ ప్రాంతాలలో ప్రారంభమైన ముందస్తు వరి కోతలు రైతులకు అద్భుతమైన రాబడిని అందిస్తున్నాయి. సన్న రకం వడ్లకు క్వింటాల్‌కు రికార్డు స్థాయిలో రూ. 3,400 నుండి రూ. 3,600 వరకు ధర పలుకుతుండటంతో నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో సన్న ధాన్యం కొరత వస్తుందనే అంచనాలతో కర్ణాటక, మహారాష్ట్ర, మిర్యాలగూడ ప్రాంతాల వ్యాపారులు నేరుగా రైతుల కళ్ళాల వద్దకే వచ్చి పచ్చి వడ్లను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు.
Rice Prices Telangana AP | రైతులకు దక్కుతున్న ఊరట..
వ్యాపారులే నేరుగా కొనుగోలు చేస్తుండటంతో వడ్లను ఆరబెట్టే శ్రమ, రవాణా, కూలీల ఖర్చులు తప్పి రైతులకు సమయంతో పాటు డబ్బు ఆదా అవుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా మంచి రాబడి దక్కుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకైతే గిట్టుబాటు ధర లభిస్తోంది కానీ.. మార్కెట్‌లో మాత్రం బియ్యం ధరలు వంద వైపు పరుగులు తీస్తుండటం సామాన్యుడికి గగనంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: Akun Sabharwal | మళ్లీ తెలంగాణకు ఐపీఎస్ అకున్ సభర్వాల్