అక్షరటుడే, వెబ్డెస్క్ : El Niño Effect | మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) సంచలన వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో పంటలు సాగు చేయొద్దని రైతులకు సూచించారు.
యాసంగి పంటలు వేయొద్దని ప్రభుత్వం తరుఫున రైతులను వేడుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఎల్నినోతో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందన్నారు. రానున్న రోజుల్లో సాగునీరే కాదు.. తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో పంట వేసి ఇబ్బందులు పడొద్దని కోరారు.
El Niño Effect | పంటలు ఎండిపోతాయి
ప్రస్తుతం వానాకాలం పంటలే నీరందక ఎండిపోతున్నాయని మంత్రి తెలిపారు. యాసంగిలో సాగు చేస్తే సాగునీరు అందదన్నారు. భూగర్భ జలాలు పడిపోతాయని, విద్యుత్ కొరత సైతం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో పంటలు వేసి ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.
El Niño Effect | తీవ్ర ప్రభావం
ఎల్నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ బృందం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. రాష్ట్రానికి అధిక ఆర్థిక సహాయం అందించేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, జీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో అదనపు పనిదినాలు కల్పించాలని కోరుతామని తెలిపారు.
El Niño Effect | దేవుడు వచ్చినా నీళ్లు ఇవ్వలేం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Agriculture Minister) మాట్లాడుతూ.. తాగడానికి నీళ్లు లేవు, రిజర్వాయర్లు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. రిజర్వాయర్లలో కరెంట్ ఉత్పత్తి చేయడానికి కూడా నీళ్లు లేవని వెల్లడించారు. ముందు తాగడానికి మంచి నీళ్లు సమకూర్చుకుందామని తెలిపారు. దేవుడు వచ్చినా నీళ్లు ఇవ్వడం కుదరదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంటలు వేసే ముందు ఆలోచించాలని రైతులకు సూచించారు.
దీనిని కూడా చదవండి : El Nino Effect | ముందున్నది కష్టకాలం.. పొదుపు మంత్రంతోనే భరోసా