అక్షరటుడే వెబ్‌డెస్క్: AP ITI Modernization | ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా), కేంద్ర ప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ‘PM-SETU’ (పీఎం-సేతు) పథకం కింద విశాఖపట్నం క్లస్టర్‌లోని నాలుగు ప్రభుత్వ ఐటీఐల (ITIs) ఆధునీకరణ కోసం ఒప్పందం (Shareholders’ Agreement) చేసుకుంది. రూ. 200 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్, జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం పొందిన దేశంలోనే తొలి క్లస్టర్ ప్రణాళికగా రికార్డు సృష్టించింది.
AP ITI Modernization | ప్రత్యేక సంస్థ (SPV) ఏర్పాటు..
ఈ ఐటీఐల సమర్థవంతమైన నిర్వహణ , ఆధునీకరణ పనులను వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక ప్రయోజన సంస్థను (SPV) ఏర్పాటు చేయనున్నారు. ఇందులో AM/NS ఇండియా సంస్థ 51% మెజారిటీ వాటాను కలిగి ఉండగా, కేంద్ర ప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెరో 24.5% వాటాలను పంచుకోనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఐటీఐ శిక్షణా వ్యవస్థను పూర్తిగా మార్చివేయనున్నారు.
AP ITI Modernization |నాలుగు ప్రముఖ ఐటీఐలు..
ఈ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలోని నాలుగు కీలక ప్రభుత్వ ఐటీఐలను ఎంపిక చేశారు. అందులో కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐ ప్రధాన శిక్షణ కేంద్రంగా (Hub) వ్యవహరిస్తూ, ఉమ్మడి వనరుల ద్వారా మిగిలిన కేంద్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. దీంతో పాటు విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని బాలికల ప్రభుత్వ ఐటీఐ, బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ , నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐలను ఈ నిధులతో మోడల్ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నారు.
AP ITI Modernization | ప్రత్యక్ష శిక్షణ..
AM/NS ఇండియా తమ సాంకేతిక విద్యా భాగస్వామి అయిన ‘నామ్‌టెక్’ (NAMTECH) సహకారంతో ఈ కేంద్రాల్లో ఆధునిక మౌలిక వసతులను సమకూర్చనుంది. పాతబడిపోయిన కోర్సుల స్థానంలో మేకింగ్, ఆటోమేషన్, ప్రొడక్షన్ రంగానికి అవసరమైన కొత్త ట్రేడ్లను ప్రవేశపెడతారు. విద్యార్థులు నేరుగా కంపెనీలలో వాడే మిషన్లపై ప్రాక్టికల్స్ చేసేలా శిక్షణ ఇవ్వడంతో పాటు, ఐటీఐ బోధకులకు (Instructors) కూడా నూతన సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
AP ITI Modernization | ఉద్యోగాలు కల్పించడమే..
రాష్ట్ర ఐటీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (HRD) శాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh )మాట్లాడుతూ… ఏపీలో పారిశ్రామిక పురోగతి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. AM/NS ఇండియా లాంటి ప్రముఖ సంస్థతో భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ ఐటీఐలలో చదివే పేద విద్యార్థులకు కూడా ప్రైవేట్ శిక్షణా సంస్థలకు దీటుగా ప్రాక్టికల్ నైపుణ్యాలు అందుతాయని, దీనివల్ల కోర్సు పూర్తయిన వెంటనే వారికి సులభంగా ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Sharannavaratri Security | శరన్నవరాత్రి ఉత్సవాలపై ప్రత్యేక నిఘా