Harish Rao | ఉచిత విద్యుత్​కు ఎసరు పెట్టే కుట్ర : హరీశ్​రావు

రైతు డిస్కమ్​ పేరుతో ఉచిత విద్యుత్​ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీశ్​రావు ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | రైతు డిస్కమ్​ పేరుతో ఉచిత విద్యుత్​ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీశ్​రావు ఆరోపించారు. రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను ఆయన ఖండించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నిలిపివేసి, రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెర తీసిందని మాజీ మంత్రి విమర్శించారు. ఈ డిస్కమ్​తో రైతులకు జరిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ తీరుతో రైతులు మరింత ఇబ్బందులు పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao | ఎండిపోతున్న పంటలు

ఓ వైపు పంటలు ఎండిపోయి రైతులు (Farmers) కన్నీరు పెడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. ఉచిత విద్యుత్‌పై చేతులెత్తేసేందుకే రైతు డిస్కం తెచ్చిందన్నారు. జీవో ప్రకారం కొత్త డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, HMWSSB, మిషన్ భగీరథ, మొత్తంగా 30,62,853 కనెక్షన్లు బదిలీ చేశారన్నారు. ఇంత భారీ వ్యవస్థ నిర్వహణ 2 వేల మంది సిబ్బందితో ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. 25 శాతం థర్మల్ పవర్ అలకేషన్‌తో రైతులకు సాగు, ప్రజలకు తాగునీళ్లకు అవసరం అయ్యే భారీ విద్యుత్ వ్యవస్థ ఎలా నడుస్తుందన్నారు.

Harish Rao | కేటాయింపుల అనుమానం

థర్మల్​ విద్యుత్​లో 25శాతం, 58శాతం సోలార్​, 100శాతం జల విద్యుత్​ను రైతు డిస్కంకు కేటాయించారు. పగటి పూట మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే, రాత్రి ఎలా అని హరీశ్​రావు ప్రశ్నించారు. జల విద్యుత్​ 2325 మెగావాట్లు కేటాయించారని, అయితే అది 3 నుంచి 4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. మిగతా సమయంలో రైతులకు విద్యుత్ ఎలా అని హరీశ్​రావు ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, 24 గంటల సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Ponguleti Srinivas Reddy | ప్రజలను అణచివేస్తున్న బీజేపీ, బీఆర్​ఎస్​ : పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *