అక్షరటుడే, బోధన్: Bodhan Police Crime Review | డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) సూచించారు. వర్ని పోలీస్స్టేషన్లో చింతకుంట వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం బోధన్ (Bodhan) డివిజన్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
Bodhan Police Crime Review | మత్తు పదార్థాలు రవాణా చేస్తే..
ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. డ్రగ్స్, మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య , హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Bodhan Police Crime Review | నేరుస్తుల కదలికలపై నిఘా ఉంచాలి..
అలాగే నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని.. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, బెయిల్పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సీపీ సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పేకాట, గుట్కా, ఇసుక ఇతర అక్రమ వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు.
Bodhan Police Crime Review | పోలీస్స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం..
పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. రిసెప్షన్, రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తరించి, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. డయల్ 112 గురించి ప్రజల వద్దకు చేరే విధంగా అనుక్షణం కృషి చేయాలి.
చింతకుంట ఆశ్రమంలో..
వర్ని పోలీస్స్టేషన్ పరిధిలోని చింతకుంట ఆశ్రమంలో వృద్ధులతో సీపీ ప్రత్యేకంగా మాట్లాడారు. 25మంది వృద్ధులు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుండగా.. వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. అలాగే వారికి స్వయంగా వడ్డించారు. కొత్త దుస్తులు అందజేశారు. వృద్ధులు కుటుంబాలకు, సమాజానికి విలువైన సంపద అని, వారి అనుభవాలు, జీవిత పాఠాలు భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వయస్సు పైబడిన తల్లిదండ్రులు, వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం, ప్రేమ, ఆప్యాయతతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్హెచ్వో వెంకట్ నారాయణ, వర్ని ఎస్సై వంశీకృష్ణ, ఆశ్రమ నిర్వాహకులు చింతకుంట మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేంద్రం సాయం..!