అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Traffic Problems | మూడు రాష్ట్రాలు, నాలుగు జిల్లాలకు కూడలిగా ఉన్న కామారెడ్డి పట్టణం రోజురోజుకూ రద్దీ నగరంగా మారుతోంది. జాతీయ రహదారి అందుబాటులో ఉండటం, పట్టణం మీదుగా రైల్వేమార్గం వెళ్లడంతో వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు మాత్రం పెరగకపోవడం ట్రాఫిక్ సమస్యను తీవ్రతరం చేస్తోంది.
కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తయినా పట్టణ రహదారుల విస్తరణ మాత్రం అక్కడే ఆగిపోయింది. గత ప్రభుత్వం సుందరీకరణ పనులపై దృష్టి పెట్టిందే తప్ప రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధిపై ఫోకస్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. పట్టణ పరిధి పెరుగుతున్నా, జనాభా, వాహనాలు పెరుగుతున్నా ఇరుకు రోడ్లే దిక్కయ్యాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.
Kamareddy Traffic Problems | జంక్షన్ల అభివృద్ధిలో నిర్లక్ష్యం
పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన ఇందిరాగాంధీ చౌరస్తా, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ ఏరియాల్లో ఇప్పటికీ సరైన జంక్షన్ల ఏర్పాటు జరగలేదు. జంక్షన్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరైనప్పటికీ అడుగులు ముందుకు పడటం లేదు. వచ్చిన నిధులు ఉన్నాయో.. లేక ఇతర పనులకు మళ్లించారో తెలియని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ సరిగా పనిచేయకపోవడం, ట్రాఫిక్ పోలీసుల కొరతతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. స్కూల్, కాలేజీ సమయాల్లో, సాయంత్రం వేళల్లో ఈ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోవడం నిత్యకృత్యంగా మారింది.
Kamareddy Traffic Problems | పార్కింగ్ లేక వాహనదారుల అవస్థలు
పట్టణంలో అతిపెద్ద సమస్యగా పార్కింగ్ మారింది. నిత్యం వేలాది వాహనాలు పట్టణానికి వస్తున్నా ఇప్పటివరకు అధికారికంగా ఒక్క పార్కింగ్ స్థలాన్ని కూడా మున్సిపాలిటీ గుర్తించలేదు. దీంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలపడంతో ట్రాఫిక్కు మరింత అంతరాయం కలుగుతోంది. వాణిజ్య సముదాయాల వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, ఇటీవల ప్రధాన రహదారిపై షాపింగ్ మాల్స్ ఏర్పాటు కావడంతో ప్రధాన రహదారులన్నీ పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి.
Kamareddy Traffic Problems | పార్కింగ్ స్థలాల గుర్తింపుపై నిర్లక్ష్యం
ప్రధాన రహదారుల వెంట వందలాది దుకాణాలు వెలిశాయి. దుకాణ యజమానుల వద్ద అనుమతులు తీసుకుని రోడ్డుకు ఆనుకుని మరికొన్ని చిరు వ్యాపారాలు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పటికి అనేకసార్లు మున్సిపల్, పోలీసు అధికారులు రహదారి వెంట పార్కింగ్ కోసం మార్కింగ్ చేశారు. కొన్నిరోజుల పాటు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత పార్కింగ్ స్థలాల ఏర్పాటును పూర్తిగా మర్చిపోయారు.
Kamareddy Traffic Problems | పరిష్కారం ఎప్పుడో..?
పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ, కొత్త జంక్షన్ల ఏర్పాటు, శాటిలైట్ పార్కింగ్ స్థలాల గుర్తింపు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా ఏర్పడి పదేళ్లవుతున్నా జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కనీస వసతులు లేకపోవడం పట్ల పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇకనైనా నాయకులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Advanced Neuro Treatments | యశోద ఆస్పత్రిలో అధునాతన న్యూరో చికిత్సలు