అక్షరటుడే, కామారెడ్డి: Gandhari ATM Robbery | గాంధారి (Gandhari) ఏటీఎం చోరీ జిల్లాలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా పోలీసు అధికారుల పనితీరును వేలెత్తి చూపేలా చోరీ జరిగిందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో చోరీ కేసును జిల్లా ఎస్పీ సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ఓ ఏఎస్సై, కానిస్టేబుళ్లకు ఛార్జి మెమోలు సైతం జారీ చేశారు. అలాగే విచారణకు సైతం పలు బృందాల్లో ఇతర రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
ఏటీఎం చోరీ అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఒక నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సీసీ పుటేజీ ఆధారంగా విచారణ కోసం ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ బృందాలు నిందితుల వేటలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Gandhari ATM Robbery | సస్పెన్షన్, ఛార్జి మెమోల వేటు
ఏటీఎం చోరీ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ఓ ఏఎస్సై, కానిస్టేబుళ్లకు ఛార్జీమెమోలు సైతం జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సిబ్బందిపై చర్యలతో మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేసినట్టుగా పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ చర్యలతో జిల్లాలోని పోలీస్ సిబ్బందిలో ఒక్కసారిగా కలకలం రేగింది. చోరీ కేసు విచారణ పూర్తయ్యే వరకు మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Gandhari ATM Robbery | ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఏటీఎం చోరీ అనంతరం ఎస్పీ ఆదేశాలతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒక్కో బృందానికి ఒక్కో పనిని అప్పగించారని, సీసీ పుటేజీల పరిశీలన, అనుమానితుల గుర్తింపు, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు వెళ్లినట్టుగా విశ్వసనీయ సమాచారం.
Gandhari ATM Robbery | సీసీ కెమెరాల ఆధారంగా..
చోరీ జరిగిన సమయంలో స్థానికంగా ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఒక నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏటీఎం సమీపంలోని దుకాణాలు, ప్రధాన రహదారిపై ఉన్న కెమెరాల్లో నిందితులు కదలికలు రికార్డ్ అయినట్టు సమాచారం. వారు వచ్చిన వాహనం, దాని నంబర్ ప్లేట్, వారు ధరించిన దుస్తులు, ముఖాలు వంటి ఆధారాలను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. అదే ఆధారంగా నిందితుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం.
Gandhari ATM Robbery | ఇతర రాష్ట్రాలకు జిల్లా పోలీసు బృందాలు..?
చోరీ చేసిన నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉండే అవకాశం ఉండటంతో జిల్లా పోలీసు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి గాలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లోని అనుమానిత ప్రాంతాల్లో గాలిస్తున్నారని, అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకుని విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. గతంలో ఇలాంటి ఏటీఎం చోరీల్లో పాల్గొన్న ముఠా పనేనా అనే కోణంలోనూ విచారణ జరుగుతోందని చెబుతున్నారు. కామారెడ్డిలో ఫేక్ కరెన్సీ కేసులో సైతం ఇదే రీతిలో పోలీసు ప్రత్యేక బృందాలు ఇతర రాష్ట్రాల్లో రిస్క్ ఆపరేషన్ చేపట్టి కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం ఏటీఎం చోరీ నిందితుల గుట్టురట్టు చేసే పనిలో కామారెడ్డి పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Gandhari ATM Robbery | త్వరలో కేసును కొలిక్కి తెచ్చే అవకాశాలు
ప్రస్తుతం పోలీసులకు కీలక ఆధారాలు దొరికినట్టుగా తెలుస్తోంది. నిందితుల వేటలో ఉన్న బృందాలు త్వరలోనే వారిని పట్టుకునే అవకాశం ఉందని పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చోరీ జరిగిన తీరు, నిందితులు తప్పించుకునే మార్గం వంటి అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిందని, కేసును త్వరలోనే కొలిక్కి తెచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నట్టు సమాచారం. గాంధారి ఏటీఎం చోరీ కేసు జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. నిందితులను పట్టుకుంటేనే పోలీసులపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతాయని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్యపై దాడి..