అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TG Organics App | ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో సాగైన పంటలకు అధిక డిమాండ్ ఉంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడిన పంటలతో ఆరోగ్యానికి హాని కలుగుతోందని పలువురు సేంద్రియ ఉత్పత్తులు వినియోగిస్తున్నారు.
రాష్ట్రంలో పలువురు రైతులు సేంద్రియ సాగు (Organic Farming) వైపు మళ్లుతున్నారు. అయితే ఈ విధానంలో దిగుబడి తక్కువగా ఉంటుంది. బయట మార్కెట్ రేటుతో అమ్మితే రైతులు నష్టపోతారు. సేంద్రియ పంటలను ఆసక్తి ఉన్న వారు కొనుగోలు చేస్తున్నారు. అయితే సేంద్రియ రైతులు, కొనుగోలుదారులను కలిపేందుకు ప్రభుత్వం యాప్ రూపొందించింది. రాష్ట్రంలో ఇక రైతుల నుంచి నేరుగా సేంద్రియ ఉత్పత్తులను యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు
TG Organics App | మే 4న ప్రారంభం
ప్రభుత్వం మే 4న “టీజీ ఆర్గానిక్స్” యాప్‌ను ప్రారంభించనుంది. రైతులు, కొనుగోలుదారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం, నకిలీ సేంద్రియ ఉత్పత్తులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. తాండూరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఈ యాప్‌ను ప్రారంభిస్తారు. కొనుగోలుదారులు ధృవీకరించబడిన సేంద్రియ రైతులతో నేరుగా కనెక్ట్ అవ్వవచ్చు. యాప్‌లో ఇప్పటికే 500కుపైగా మంది రైతులు నమోదు చేసుకున్నారు. 100కు పైగా పంట ఉత్పత్తులు ఉన్నాయి.
TG Organics App | ధ్రువీకరణ ఉంటేనే..
సేంద్రియ సాగుకు డిమాండ్ ఉండటంతో కొందరు ఇతర పద్ధతిలో పండించిన పంటలను సైతం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటూ విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వ ధృవీకరణ పొందిన రైతుల పేర్లు మాత్రమే యాప్‌లో ఉంటాయి. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల వివరాలు మనకు యాప్‌లో కనిపిస్తాయి. వారి నుంచి మనకు కావాల్సిన పదార్థాలు కొనుగోలు చేయొచ్చు. తెలంగాణలో 10,000 మందికిపైగా మంది సేంద్రియ రైతులు, సుమారు 50,000 ఎకరాల భూమి ధృవీకరణ పరిధిలో ఉంది. ఈ యాప్‌తో అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరగనుంది.
దీనిని కూడా చదవండి : conductor attacks officer | లంచం అడిగిన అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్

