అక్షరటుడే వెబ్‌డెస్క్: Dharmapuri Arvind | తెలంగాణలో ( Telangana )బీజేపీ పార్టీ సైలెంట్ అయిపోయిందన్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో పార్టీ సైలెంట్ కాలేదని, 2028 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ సునామీ సృష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించేందుకు తెరవెనుక పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Dharmapuri Arvind | రహస్య ఒప్పందం..
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయని అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు చర్చలు జరుగుతున్నాయని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే అడ్డుగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందని, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు ద్వారా రేవంత్ రెడ్డిని రాజకీయంగా పక్కన పెట్టాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Dharmapuri Arvind | బీఆర్ఎస్ దోపిడీపై విమర్శలు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని, అలాంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మళ్లీ ఓటేసే పరిస్థితి లేదని అర్వింద్ స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు చేయించుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో తెలంగాణలోని మీడియా ఛానల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కాషాయమయం కాబోతున్నాయని, ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డం పెంచడంపై అర్వింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతావని ఎవరో చెబితేనే కేటీఆర్ అలా చేస్తున్నారని ఎగతాళి చేశారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కావాలని గడ్డం పెంచుకున్నారని, కానీ ఆయన గడ్డం పెరిగింది తప్ప పార్టీ పుంజుకోలేదని గుర్తుచేశారు. కేటీఆర్‌కు కూడా గడ్డం పెరుగుతుంది తప్ప భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు.
Dharmapuri Arvind | ఎవరితోనూ పొత్తు లేదు..
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ సొంత బలంతో అధికారంలోకి రావడం తథ్యమని అర్వింద్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ మాయం చేయనవసరం లేదని, ఆ పార్టీ అంతర్గత కలహాలతో కాలక్రమేణా తానే కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.
ఇది కూడా చదవండి: Treated Water Usage | శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం: జలమండలి ఎండీ