Sriram Sagar Project | కరువుకోరల్లో శ్రీరాంసాగరం.. ఎల్​నినో ఎఫెక్ట్​తో అయోమయంలో రైతన్న

ఉత్తర తెలంగాణ జీవనాడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ (పోచంపాడ్​) ఇప్పుడు పూడిక దిబ్బలతో, ఇసుక నేలలతో దర్శనమిస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar Project | ఉత్తర తెలంగాణ జీవనాడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ (పోచంపాడ్​) ఇప్పుడు పూడిక దిబ్బలతో, ఇసుక నేలతో దర్శనమిస్తోంది. సూపర్ ఎల్​నినో ప్రభావంతో ఎగువ మహారాష్ట్ర (Maharashtra)లోని పుట్టిన చోటు నుండే గోదావరికి వరద లేకపోవడంతో ఎస్సారెస్పీ ఇన్​ఫ్లో పూర్తిగా పడిపోయింది. నీళ్లు లేక బోసిపోతోంది.

Sriram Sagar Project | శ్రీరామ్​సాగర్ ప్రస్తుత పరిస్థితి..

ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 36 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీ 7 టీఎంసీలు పోతే వాడుకోదగ్గది 29 టీఎంసీలే మాత్రమే. ఈ ఏడాది రాష్ట్రంలో 36 రిజర్వాయర్లలో నీరు ప్రమాదకర స్థాయికి పడిపోయింది. అందులో గోదావరి బేసిన్​లో ఎస్సారెస్పీ (SRSP) (48.58 టీఎంసీల నుండి 36 టీఎంసీలకు), ఎల్లంపల్లిలో 18.17 టీఎంసీలు, మిడ్ మానేరులో 23.42, లోయర్ మానేరులో 15.42 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం నవంబర్ 1 నుండి ఆయకట్టుకు నీరు నిలిపివేసి, తాగునీటికే రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. 315 కరువు మండలాల కోసం రూ.6వేల కోట్ల ఎల్​నినో ఎమర్జెన్సీ ఫండ్​ను కూడా ప్రకటించింది. ఆయకట్టును కాపాడేందుకు అక్టోబర్ 10 నుండి 20 వరకు 9 టీఎంసీలను కాకతీయ (LMC), సరస్వతి, లక్ష్మీ, వరద కాలువలు, అలీసాగర్-గుప్తా లిఫ్టుల ద్వారా ఒక్క తడికి విడుదల చేశారు. కానీ ఆ నీరు చివరి ఆయకట్టు అయిన బాల్కొండ, ఆర్మూర్, జక్రాన్ పల్లి వరకు చేరనే లేదు.

Sriram Sagar Project | రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

లెక్కల్లో 36 టీఎంసీలు అంటే అధికారులకు ఒక సంఖ్య. కానీ ఇక్కడి రైతుకు అది ఆర్నెళ్ల శ్రమ. నవంబర్​లో కోతకు రావాల్సిన వరి ఇప్పుడు పాలు పోసుకుంటోంది. ఈ సమయంలో ఒక్క తడి ఇవ్వకపోతే గింజ తాలు అవుతుంది. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు అప్పులెలా తీర్చాలి అని బెంగ పెట్టుకుంటున్నాడు.

Sriram Sagar Project | నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో..

నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 6లక్షల ఎకరాల ఆయకట్టు ఇప్పుడు ప్రమాదంలో పడింది. కాలువ చివరి రైతులకు నీరు చేరకపోవడంతో, వారు రాత్రిళ్లు కాలువ గట్ల వద్దే కాపలా కాస్తున్నారు. బోర్లలో నీరు అడుగంటడంతో వ్యవసాయ మోటార్ల వినియోగం పెరిగి, ట్రాన్స్​ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో కరెంట్ డిమాండ్ 20వేల మెగావాట్లు దాటి రికార్డు సృష్టిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో వరి ధాన్యాగారంగా ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు ప్రతి ఏటా ‘నీరు వస్తుందా.. రాదా?’ అనే బెంగతోనే పంటలు వేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ, ఇతర ప్రాజెక్టులతో నీటిని ఆపేయడం, దిగువన పూడికతో సామర్థ్యం తగ్గడం, తోడు ఎల్​నినోతో వర్షాభావం.. మూడు కలిసి శ్రీరాంసాగర్​కు జలాలు రాకుండా అడ్డుకుంటున్నాయి.

Sriram Sagar Project | శ్రీరాంసాగర్ చరిత్రలో సంక్షోభాలు..

1) శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 1963 జూలై 26న జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. పూర్తి సామర్థ్యం 112 టీఎంసీలు, ఎఫ్​ఆర్​ఎల్​ (FRL) 1,091 అడుగులు. కానీ మొదటి నుండి ఇది సంక్షోభాల ప్రాజెక్టుగానే మిగిలిపోయింది.

2. 1972-73లో తొలి పెద్ద కరువు వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుండగానే మహారాష్ట్రలో వర్షాభావం, గోదావరిలో ఇన్​ఫ్లో 20 టీఎంసీలకు కూడా రాలేదు. ఫలితంగా నిర్మాణ పనులు 2 ఏళ్లు ఆలస్యంమైంది. దీంతో ఆయకట్టు రైతులు ఆ ఏడాది పంటలే వేయలేదు.

3. 1987లో చరిత్రలోనే అత్యంత దారుణం పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా అతి పెద్ద కరువు ఏర్పడింది. నీటిమట్టం 1,011 అడుగులకు పడిపోయింది. ఇది చరిత్రలోనే అత్యల్పమైన నీటిమట్టంగా నిలిచింది. రిజర్వాయర్ అడుగున పాత గ్రామాల శిథిలాలు, గుడి గోపురాలు బయటపడ్డాయి. నిల్వ 3 టీఎంసీల కంటే తక్కువ. నిజామాబాద్ పట్టణానికి కూడా తాగునీరు కరువైంది.

4. 1992-93, 1999-2004లలోనూ వరుస కరువులు ప్రాజెక్టును..దాని కింద ఆయకట్టును అతలాకుతలం చేశాయి. ఈ పన్నెండేళ్లలో ఆరుసార్లు ప్రాజెక్టు 50శాతం కూడా నిండలేదు. 2000-2004 మధ్య వరుసగా నాలుగేళ్లు సగటు ఇన్​ఫ్లో 30 టీఎంసీలు మాత్రమే ఉంది. ఆ సమయంలోనే తొలిసారిగా పూడిక సమస్య బయటపడింది. సామర్థ్యం 112 నుండి 90 టీఎంసీలకు తగ్గిందని అధికారులు ఒప్పుకున్నారు.

5. 2009లో మహారాష్ట్ర బాబ్లీ ఎఫెక్ట్ శ్రీరాంసాగర్​పై పడింది. ఎగువన మహారాష్ట్ర 14 గేట్లు మూసి నీటిని ఆపేయడంతో శ్రీరాంసాగర్​కు జూలై-ఆగస్టులో ఒక్కచుక్క కూడా ఇన్​ఫ్లో రాలేదు. అప్పటి ఉమ్మడి ప్రభుత్వం కేంద్రం జోక్యం చేసుకోవాలని ఢిల్లీకి లేఖలు రాసింది. 2014-2016లో తెలంగాణ ఏర్పాటు తర్వాత అతిపెద్ద సంక్షోభం ఎస్సారెస్పీ చరిత్రలోనే అత్యంత విషాద ఘట్టంగా నిలిచిపోయింది. 2014 ఇన్​ఫ్లో కేవలం 14 టీఎంసీలు మాత్రమే ఎగువ నుంచి వచ్చింది. 2015లో ఇన్​ఫ్లో కేవలం 2 టీఎంసీలు వచ్చింది. 50 ఏళ్ల చరిత్రలో అత్యల్పంగా ఇన్​ఫ్లోగా 2016 జనవరి రికార్డులకెక్కింది.

6. 2018-2019లో మళ్లీ కరువు..  2018లో ఖరీఫ్​లో 35 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. దీంతో రబీలో ఆయకట్టుకు నీరు ఇవ్వలేదు. 2026 ప్రస్తుతం వర్షాలు లేక ​తో అక్టోబర్ 24 నాటికి శ్రీరామ్ సాగర్​లో 36 టీఎంసీ నీటి నిల్వ ఉంది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Hanuman Katha Induru | హనుమాన్ కథ వైభవం అద్భుతం : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *