అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Student Kidnapping Drama | ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన ఓ నీట్ విద్యార్థి చేసిన అప్పులు తీర్చుకోవడానికి, ప్రియురాలితో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడాడు. స్వయంగా తండ్రినే బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేసిన ఆ యువకుడి నాటకం.. పోలీసుల ఎంట్రీతో బట్టబయలైంది.
NEET Student Kidnapping Drama | కిడ్నాప్ డ్రామా..
ఢిల్లీకి ( Delhi )చెందిన 17 ఏళ్ల యువకుడు లఖ్‌నవూలోని అలంబాగ్‌లో అద్దె ఇంట్లోంటూ నీట్ పరీక్షలకు ప్రిపేరవుతున్నాడు. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడి సుమారు రూ. 50 వేల వరకు అప్పు చేశాడు. ఆ అప్పులు తీర్చడంతో పాటు గర్ల్‌ఫ్రెండ్‌తో సరదాగా ట్రిప్‌కు వెళ్లేందుకు సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచించాడు. ఇందులో భాగంగానే తాను కిడ్నాప్‌నకు గురైనట్లు నమ్మించాలని ప్లాన్ వేసుకున్నాడు.
NEET Student Kidnapping Drama | రూ. 5 లక్షలు డిమాండ్ ..
అక్టోబర్ 20 నుంచి ఆ యువకుడి ఫోన్ పనిచేయకపోవడం, ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో యువకుడి సోదరుడు, తల్లిదండ్రులు, మేనమామల వాట్సప్ నంబర్లకు కొందరు మెసేజ్‌లు పంపారు. ఆ యువకుడిని తాము కిడ్నాప్ చేశామని, వెంటనే రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు.
NEET Student Kidnapping Drama | దర్యాప్తులో బయటపడిన నిజం..
ఈ కిడ్నాప్ డ్రామాను ఛేదించడానికి రంగంలోకి దిగిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. సదరు యువకుడు తన ఫోన్ నుంచి తన అత్త కూతురికి మెసేజ్ చేస్తూ.. తాను ఎక్కడ ఉన్నానో తనకు కూడా తెలియట్లేదని, తినడానికి కూడా డబ్బులు లేవంటూ ఓ క్యూఆర్ కోడ్ పంపాడు. ఆ క్యూఆర్ కోడ్‌కు స్పందించిన ఆమె రూ. 2,000 బదిలీ చేసింది. ఆ ఆన్‌లైన్ లావాదేవీని ఆధారంగా చేసుకుని పోలీసులు గాలింపు చేపట్టగా.. ఆ యువకుడు కిడ్నాప్ ఏమీ కాకుండా, మరో ప్రదేశంలో తన ప్రియురాలితో కలిసి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో అందరూ అవాక్కయ్యారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi Defamation Case | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట