అక్షరటుడే, వెబ్డెస్క్: Daughter Murder Case | కుమార్తెనే తల్లి గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కొత్తూరు పురపాలక కేంద్రంలో వెలుగు చూసింది. హత్య అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్‌నగర్ జోన్ డీసీపీ శిరీష రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Daughter Murder Case | మాటామాటా పెరిగి ..
కొత్తూరులోని హనుమాన్ కాలనీలో నివాసముండే ముయ్యడి రాజు (ఆటోడ్రైవర్), విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సువర్చల (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మద్యపానానికి (కల్లు) బానిసైన తల్లి విజయలక్ష్మి.. నిత్యం కుమార్తెతో గొడవపడుతుండేది. ఈ క్రమంలో అక్టోబర్ 27 సాయంత్రం కూడా ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన విజయలక్ష్మి.. కుమార్తె గొంతునులిమి ప్రాణాలు తీసింది.
Daughter Murder Case | ఆత్మహత్యగా చిత్రీకరణ..
నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు విజయలక్ష్మి పక్కా ప్లాన్ వేసింది. బాలిక మెడకు చీర బిగించి, ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త రాజుకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమార్తె ఇటీవలే పుష్పవతి కావడంతో కడుపునొప్పి భరించలేక బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని తండ్రి భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.
Daughter Murder Case | బయటపడ్డ అసలు నిజం..
దర్యాప్తులో భాగంగా తల్లి ప్రవర్తనపై అనుమానం రావడం, పోస్టుమార్టం నివేదికలో గొంతునులిమి హత్య చేసినట్లు తేలడంతో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చారు. విజయలక్ష్మిని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. బాలిక నిరంతరం ఫోన్ మాట్లాడటం, తన మాట వినకపోవడంతోనే కోపంతో హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించినట్లు డీసీపీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Low Pressure in Bay of Bengal | బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం