Compassionate Appointment Scam | పదవీ విరమణ ఉద్యోగిని.. మళ్లీ ఉద్యోగంలో చంపేసి.. కొడుకుకు కారుణ్య కొలువు కట్టబెట్టి.. ఇది అవినీతి సిస్టమ్ అల్టిమేట్ థ్రిల్లర్!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Compassionate Appointment Scam | పదవీ విరమణ పొంది, కాలంచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని విధుల్లో ఉండగానే మరణించినట్లు రికార్డులు సృష్టించి, ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కట్టబెట్టిన సంచలనాత్మక కుంభకోణాన్ని నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు.

సినిమా కథను తలపించేలా సాగిన ఈ అక్రమ వ్యవహారంలో వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

Compassionate Appointment Scam | రూ. 13 లక్షల డీల్.. ఆధార్ చిరునామా మార్పు

నకిరేకల్ మండలం ఒగోడుకు చెందిన చామకూరి వెంకటేశ్వర్లు శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసి 2025 మే 31న పదవీ విరమణ పొందారు. అనారోగ్యంతో ఆయన 2025 నవంబర్ 17న మరణించారు.

అయితే, ఆయన ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు చూపిస్తే కుమారుడికి కారుణ్య నియామకం వస్తుందని భావించిన కుటుంబ సభ్యులు, పలువురు అధికారులతో కలిసి రూ. 13 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు.

ముందుగా నల్గొండలోని మీ సేవా కేంద్రం ద్వారా వెంకటేశ్వర్లు ఆధార్ కార్డులో తప్పుడు చిరునామా నమోదు చేశారు. దాని ఆధారంగా, ఆయన మే 28నే (ఉద్యోగంలో ఉండగా) మరణించినట్లు నల్లగొండ మున్సిపాలిటీ నుంచి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం పొందారు.

Compassionate Appointment Scam | అధికారుల అండతో అక్రమ నియామకం

శాలిగౌరారం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ సమ్మతితో దరఖాస్తును డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపగా, అక్కడ పనిచేస్తున్న సీసీ పోలె రంజిత్ కుమార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు కలిసి తప్పుడు విచారణ నివేదికలు తయారు చేశారు. ఈ పత్రాల ఆధారంగా మృతుడి కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల పీహెచ్‌సీలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Compassionate Appointment Scam | 14 మంది అరెస్ట్.. రూ. 5 లక్షలు స్వాధీనం

నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపి గుట్టురట్టు చేశారు. మృతుడి భార్య వసంత, కుమారుడు రాజు, డీఎంహెచ్‌వో సీసీ రంజిత్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సూర్య శిల్ప, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డిలతో సహా 14 మందిని అరెస్టు చేశారు.

నిందితుల నుంచి రూ. 5 లక్షల నగదు, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజశేఖర్ సహా మరొకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *