అక్షరటుడే, వెబ్డెస్క్: Polytechnic Colleges | తెలంగాణ Telangana లోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పాలిటెక్నిక్ కాలేజీలను కార్మిక శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి మారుస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నంబర్ 97ను సవరిస్తూ తాజాగా జీవో 157ను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలన్నీ యథావిధిగా విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి.
Polytechnic Colleges | విద్యార్థుల ఆందోళనలు..
పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖలోకి మార్చడంతో పాటు స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తారనే ప్రచారంతో గత కొంతకాలంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. విద్యాశాఖ పరిధి నుంచి తప్పిస్తే తమ భవిష్యత్తు, ఉన్నత విద్యా అవకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన కె. కేశవరావు కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి కీలక నివేదిక సమర్పించింది. కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా పాత ప్రతిపాదనను విరమించుకుంది.
Polytechnic Colleges | ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు ఇవే..
విలీనం లేదు: పాలిటెక్నిక్ కళాశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవి పూర్తిస్థాయిలో సాంకేతిక విద్యాశాఖ పర్యవేక్షణలోనే నడుస్తాయి.
కార్మిక శాఖ పరిధిలోకి ఐటీఐలు: పాలిటెక్నిక్ కాలేజీలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, ఐటీఐ (ITI), ఏటీఐ (ATI) సంస్థలు మాత్రం యథావిధిగా కార్మిక శాఖ పరిధిలోకి వెళ్లనున్నాయి.
విద్యాశాఖలోనే స్కిల్ యూనివర్సిటీ: ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ కూడా విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 157 పట్ల పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంతో సాంకేతిక విద్యలో నెలకొన్న అయోమయానికి పూర్తిస్థాయిలో తెరపడినట్లయింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..