అక్షరటుడే, కామారెడ్డి: Maoist Era in Telangana | రాష్ట్రంలో మావోయిస్టుల శకం ముగిసిందని, మాదక ద్రవ్యాల నివారణ కోసం మూడున్నరేళ్ల క్రితమే ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని (Kamareddy) పోలీసు కార్యాలయంలో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల కట్టడి, ఇతర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
Maoist Era in Telangana | శాంతిభద్రతలపై సుదీర్ఘ చర్చ..
అంతకుముందు కార్యాలయానికి వచ్చిన డీజీపీకి ఎస్పీ రాజేష్ చంద్ర, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీసు అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలపై మూడు గంటల పాటు సమీక్ష చేపట్టినట్లు తెలిపారు. దేశంలో మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగిందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. నశా ముక్త్ భారత్ ద్వారా పెద్దఎత్తున మాదకద్రవ్యాల నివారణకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రంలో మూడున్నరేళ్ల ముందే యాంటీ డ్రగ్స్ కోసం ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసి దేశంలోనే ముందంజలో ఉన్నామని, మన రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు దేశానికే మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. ప్రతి జిల్లా ఎస్పీ నుంచి కిందిస్థాయి వరకు మాదకద్రవ్యాలు నివారణకు పని చేస్తున్నాయని తెలిపారు.
Maoist Era in Telangana | ఉమ్మడి జిల్లా ఎస్పీగా..
తాను 1996 నుంచి 1999 వరకు ఉమ్మడి జిల్లా ఎస్పీగా పని చేశానని, 20 ఏళ్ల తర్వాత ఉమ్మడి జిల్లాకు వచ్చానని డీజీపీ గుర్తు చేసుకున్నారు. నాడు నక్సలైట్ల సమస్య తీవ్రంగా ఉండేదని, పోలీసులు అధికారిక వాహనాల్లో తిరిగే పరిస్థితి ఉండేది కాదన్నారు. రాజకీయ నాయకులు తప్పనిసరిగా ప్రొటెక్షన్తోనే బయటకు వెళ్లేవారని, పోలీసులకు ప్రతి నిమిషం గండంగా గడిచేదని చెప్పారు. క్లైమోర్ మైన్స్, ల్యాండ్ మైన్స్ నిర్వీర్యం చేస్తూ ముందుకు వెళ్ళేవాళ్ళమని తెలిపారు. ఇప్పుడా పరిస్థితి లేదని, ఫ్రీగా తిరుగుతున్నామని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ఆపరేషన్ కవచ్ ద్వారా సత్ఫలితాలు రావడం సంతోషకరమని డీజీపీ అన్నారు. దాదాపు 10 నుంచి 12 గ్యాంగులను కట్టడి చేశామని, మరొక నాలుగు గ్యాంగుల వివరాలు సేకరించామని తెలిపారు. జిల్లాలో 403 కేజీల గంజాయిని ఆపరేషన్ కవచ్ ద్వారానే పట్టుకున్నామని వెల్లడించారు.
Maoist Era in Telangana | సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో స్టేషన్ల వారిగా సైబర్ నేరాలపై వివరాలు సేకరించడం జరిగిందని డీజీపీ తెలిపారు. సైబర్ క్రైం అనేది పెద్ద సమస్యగా మారిందని, సంపాదించిన మొత్తం నిమిషాల్లో కొల్లగొడుతున్నారని చెప్పారు. 40 రకాల సైబర్ నేరాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ఏఐ లాంటి టెక్నాలజీ ద్వారా కుటుంబ సభ్యులను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. జిల్లాలో సైబర్ నేరాల తగ్గుదల కనిపిస్తోందని, కేసులు, డబ్బుల రికవరీలో జిల్లా ముందంజలో ఉందని, దేశంలో సైబర్ నేరాల నివారణలో రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపారు. బాన్సువాడ, దేవునిపల్లి, కామారెడ్డి, నస్రుల్లాబాద్, బిచ్కుంద, జుక్కల్, గాంధారి, పెద్ద కొడప్గల్ స్టేషన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించామని, సిబ్బంది అవసరమైన చోట అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పామని తెలిపారు.
రాష్ట్రంలో మావోయిస్టులు లేరు..
రాష్ట్రంలో మావోయిస్టులు లేరని, అందరూ లొంగిపోయారని డీజీపీ స్పష్టం చేశారు. దేశంలో ముగ్గురు మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వాళ్లు కూడా తెలంగాణకు సంబంధించిన వారు కాదన్నారు. జనజీవన స్రవంతిలో కలవడానికి వారికి ఏమి కావాలో వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో పండగలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని, శాంతిభద్రతల పరిరక్షణ బాగుందని డీజీపీ ప్రశంసించారు. బాన్సువాడలో మతఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.
పోలీసుల ఆరోగ్యం, సంక్షేమం..
పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వీటిపై అన్వేషిస్తున్నామని డీజీపీ అన్నారు. కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, ఇతరత్రా సమస్యలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఫిట్‌కాప్ కార్యక్రమం ద్వారా సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఈ యాప్ ద్వారా 75 వేల మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. టీజీపీఏలో సీనియర్లతో దశల వారిగా శిక్షణ ఇస్తామని తెలిపారు. పోలీసుల ఇంక్రిమెంట్లు పెండింగ్ పై స్పందిస్తూ విడతల వారిగా ఇస్తున్నామని, ఇటీవల 200 కోట్లు విడుదల చేశామని, క్యాష్ రివార్డులు పెండింగ్ లేవని స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలో మరొక పోలీస్ స్టేషన్, బాన్సువాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సిబ్బంది అవినీతిపై హెచ్చరిక
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడుతున్న సిబ్బందికి చాలా సార్లు పద్ధతులు మార్చుకోవాలని సూచించామని, అయినప్పటికీ మారకపోతే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని డీజీపీ అన్నారు. బుద్ధి మార్చుకోవడం లేదని, ఏసీబీ రైడ్స్ అవుతున్నాయని, చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం టీజీ-టీమార్స్ (తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్ మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో) విధానాన్ని తీసుకువస్తున్నామని డీజీపీ తెలిపారు. దీనికోసం వెయ్యి మందిని నియమించాలని నిర్ణయించామని, ప్రస్తుతం గ్రేహౌండ్స్ నుంచి 300 మందిని కేటాయించామని చెప్పారు.
హైవేలపై పోలీసింగ్..
హైవేలపై పోలీసింగ్ ఉండదని, అందుకే ఈ టీజీ-టీమార్స్ ట్రాఫిక్, హైవే పోలీసింగ్, ప్రమాదాల నివారణపై పనిచేస్తాయని తెలిపారు. ఈ బ్యూరోలో నాలుగు విభాగాలు ఉంటాయని డీజీపీ వివరించారు. ట్రాఫిక్ మేనేజ్ మెంట్ విభాగం, ఎన్ ఫోర్స్ మెంట్, ఎడ్యుకేషన్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ విభాగం, రోడ్డు, రైలు ప్రయాణ భద్రత, ప్రమాదాల నివారణ, అడ్మినిస్ట్రేషన్ విభాగం, విజిలెన్స్ అండ్ స్టాండర్డ్స్ విభాగం ప్రమాణాలు, పర్యవేక్షణపై పనిచేస్తాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ట్రాఫిక్ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై రాంగ్ పార్కింగ్ లో నిలిపే లారీల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల ద్వారా 8 వేల మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి డీఐజీ సన్‌ప్రీత్ సింగ్, మల్టీజోన్ 1 ఐజీ కార్తికేయ, సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, ఎస్పీ సీఐడీ తెలంగాణ ప్రవీణ్ కుమార్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో హర్షవర్ధన్, ఈస్ట్ జోన్ గిరిధర్, ఎస్పీ రాజేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: భోగి సినిమా సూపర్ హిట్ రివ్యూ చెప్పేసిన ఫ్యాన్