అక్షరటుడే, కామారెడ్డి: Koti Deepotsavam in Kamareddy | కామారెడ్డి పట్టణం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. భక్తులు వెలిగించిన లక్షలాది ప్రమిదల వెలుగులతో మైదానమంతా భూలోక స్వర్గాన్ని తలపిస్తూ దేదీప్యమానంగా వెలిగిపోయింది.
Koti Deepotsavam in Kamareddy | ఆధ్యాత్మిక సందడి
సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో, శ్రీశ్రీశ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ ఆహ్వానం మేరకు నిర్వహిస్తున్న శ్రీ చండి మహా యజ్ఞ సహిత శ్రీ మహా రుద్ర యజ్ఞంలో భాగంగా ఈ మహా దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, మహిళలు వేలాదిగా తరలివచ్చారు. ఒకేసారి వరుస క్రమంలో దీపాలు వెలిగించడంతో మైదానం అంతా ఒక అద్భుతమైన దీపాల హారంలా దర్శనమిచ్చింది.
Koti Deepotsavam in Kamareddy | లోక కల్యాణమే ధ్యేయంగా ప్రార్థనలు
భక్తులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి.. లోక కల్యాణం, సనాతన ధర్మ రక్షణ, దేశ క్షేమం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉదయం నుంచే వేద మంత్రోచ్ఛారణల మధ్య చండి, మహా రుద్ర యజ్ఞ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మధ్యాహ్నం భక్తులందరికీ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఉదయం యజ్ఞం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, రాత్రి కోటి దీపోత్సవంతో ఆదివారం రోజంతా డిగ్రీ కళాశాల మైదానం హరహర మహాదేవ నామస్మరణతో, భక్తి పారవశ్యంతో మార్మోగిపోయింది.