అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University | విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయాలు తీసుకునే నిర్ణయాలు.. కొన్నిసార్లు వారి కెరీర్‌కు అడ్డంకులు సృష్టిస్తాయనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ(TU) తాజాగా విడుదల చేసిన బీఈడీ (BEd Exams) నాలుగో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ (Exam Schedule) ఇప్పుడు అలాంటి వివాదానికే కేంద్రబిందువైంది.
Telangana University | జాతీయస్థాయిలో యూజీసీ నెట్..
జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నెట్ (UGC-NET) పరీక్షలు ఈనెల 29 నుంచి ప్రారంభమవుతుండగా, అదే రోజు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ నాలుగో సెమిస్టర్ థియరీ పరీక్షలను ప్రారంభించడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ రెండు పరీక్షలు ఒకే రోజు, ఒకే సమయానికి ఉండటంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. నెట్‌కు నెలల తరబడి సిద్ధమవుతున్న విద్యార్థుల్లో చాలామంది బీఈడీ కూడా చదువుతున్నారు. ఇప్పుడు ఒకే రోజు రెండు పరీక్షలు రావడంతో ఏది రాయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నెట్ రాస్తే బీఈడీ పరీక్ష కోల్పోవాల్సి వస్తుంది. బీఈడీ రాస్తే జాతీయ స్థాయి అర్హత పరీక్షను వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో వారి విద్యా, ఉద్యోగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Telangana University | నెట్‌కు ప్రాధాన్యం.. బీఈడీకి తప్పనిసరి హాజరు
నెట్ పరీక్ష దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సాధించేందుకు నిర్వహించే కీలక పరీక్ష. అలాగే పీహెచ్డీ చేసేందుకు నెట్ అవసరం. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తుంటారు. దీనికి సిద్ధం కావడానికి విద్యార్థులు నెలల తరబడి శ్రమిస్తుంటారు. మరోవైపు బీఈడీ కోర్సు పూర్తి చేయాలంటే నాలుగో సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఒక పరీక్ష మిస్ అయితే వెంటనే సప్లిమెంటరీ అవకాశం లేకపోవడంతో మరో ఏడాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా విద్యార్థులు రెండు వైపులా నష్టపోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
Telangana University | విద్యార్థుల విజ్ఞప్తిని పట్టించుకోని అధికారులు?
పరీక్షల షెడ్యూల్ విడుదలైన తర్వాత విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ అధికారులను కలిసి తేదీలను మార్చాలని కోరినట్లు సమాచారం. నెట్ పరీక్ష తేదీలను దృష్టిలో పెట్టుకొని బీఈడీ పరీక్షలను రెండు, మూడు రోజులు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నెట్ అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల కేటాయింపు పూర్తయిందని వివరించారు. అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపినా, అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Telangana University | ప్రాక్టికల్స్ కాకముందే థియరీ పరీక్షలు.. ఇది కూడా వివాదమే..
విద్యార్థులు వ్యక్తం చేస్తున్న మరో ప్రధాన అభ్యంతరం బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షల నిర్వహణ విధానంపైనే. సాధారణంగా బీఈడీ కోర్సులో స్కూల్ ఇంటర్న్‌షిప్, ప్రాక్టికల్స్, రికార్డుల మూల్యాంకనం పూర్తయ్యాకే థియరీ పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకముందే థియరీ పరీక్షలు నిర్వహించడం విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షల ద్వారా లభించే అనుభవం థియరీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందని, అలాంటి అవకాశాన్ని యూనివర్సిటీ దూరం చేస్తోందని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
Telangana University | అవగాహన లోపమా..? సమన్వయ వైఫల్యమా..?
జాతీయస్థాయిలో ముందుగానే ప్రకటించిన నెట్ పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి ఉంటే ఈ సమస్య వచ్చేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ పరీక్షల తేదీలను ఖరారు చేసే ముందు ఇతర ప్రధాన పరీక్షల క్యాలెండర్‌ను పరిశీలించడం సాధారణ ప్రక్రియ. కానీ ఈసారి అలాంటి సమన్వయం కనిపించలేదని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Telangana University | ఒక తప్పిదం… ఏడాది నష్టం
బీఈడీ పరీక్ష రాయకపోతే.. కోర్సు పూర్తి, ఫలితాలు ఆలస్యమయ్యే ప్రమాదం నెలకొంది. మరో ఏడాది నిరీక్షణ చేయాల్సిన వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. నెట్ పరీక్ష రాయకపోతే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోల్పోయే అవకాశం ఉంది. జేఆర్‌ఎఫ్ అవకాశం కోల్పోవడం.. మరో నోటిఫికేషన్ వరకు నిరీక్షణ తప్పదు. నెలల తరబడి చేసిన శ్రమ వృథా అవుతుంది. రెండు పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనవి కావడంతో అయోమయం నెలకొంది. బీఈడీ నాలుగో సెమిస్టర్ థియరీ పరీక్షలను కనీసం కొన్ని రోజులు వాయిదా వేయాలని, నెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యామ్నాయ తేదీ ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యాకే థియరీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంటున్నారు.
జాతీయస్థాయి పరీక్షల క్యాలెండర్ పాటించడం అత్యవసరం..
యూనివర్సిటీ అధికారులు పరీక్షల షెడ్యూల్ రూపొందించే సమయంలో జాతీయస్థాయి పరీక్షల క్యాలెండర్‌ను పరిశీలించడం అత్యవసరమని విద్యానిపుణులు పేర్కొంటున్నారు. లేకపోతే విద్యార్థులే నష్టపోతారని, పరిపాలనా లోపాల భారాన్ని విద్యార్థులపై మోపడం సరైంది కాదని వారంటున్నారు. తెలంగాణ యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని బీఈడీ పరీక్షల తేదీలను పునఃసమీక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఒక చిన్న షెడ్యూల్ మార్పుతో వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశముందని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: హైటెక్ సిటీ మెహిఫిల్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా లోపాలు