అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంలో బాల్భవన్ పాత్ర గొప్పదని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు వారికి ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. బాల్‌భవన్‌లో (BalBhavan) శనివారం ‘కళా వైభవం – కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్’ కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్, మేయర్ ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
BalBhavan Nizamabad | కళాకృతులను తిలకించి.. బహుమతులిచ్చి..
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.. చిన్నారులు తయారు చేసిన కళాకృతులు, గీసిన చిత్రాలను ఆసక్తితో తిలకించారు. చక్కటి పెయింటింగ్స్ గీసిన 7వ తరగతి విద్యార్థి సాయి రుధిర్ కళా నైపుణ్యాన్ని కలెక్టర్ మెచ్చుకుంటూ, చిన్నారికి బహుమతిని అందించి ప్రోత్సహించారు. పేరిణి, కోలాటం నృత్యాలతో అలరింపజేసిన చిన్నారులను, వెంట్రిలాక్విజంతో ఆకట్టుకున్న జాదూ యుగంధర్ రంగనాథ్‌ను సైతం కలెక్టర్ ప్రశంసించారు. ప్రస్తుత వేసవి శిక్షణ తరగతుల్లో బాల్ భవన్లో 720 మంది చిన్నారులకు ప్రవేశాలు కల్పించగా, వారికి అందిస్తున్న శిక్షణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
BalBhavan Nizamabad | చిన్నారుల్లో కలిసిపోయి..
సభా వేదిక దిగి కలెక్టర్ చిన్నారుల మధ్యకు వెళ్లి వారికి ఆయా అంశాలపై ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. చిన్నారులు అందరికీ చాక్లెట్లు పంచుతూ, ప్రతిభ చాటిన బాలబాలికలకు బహుమతులు అందించారు. బాలభవన్ ద్వారా చక్కటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులను అభినందించారు. చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను బాల భవన్ లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు.
చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మేయర్ ఉమారాణి (Mayor Umarani) మాట్లాడుతూ.. నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో బాల భవన్ ద్వారా అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్(DEO Ashok), బాల్భవన్ సూపరింటెండెంట్ ఉమాబాల, మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన


