Transgender Village Ban | కలెక్టర్​ చొరవతో గ్రామాల్లో ట్రాన్స్​జెండర్ల రాకపై నిషేధం ఎత్తివేత..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Transgender Village Ban | జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్​జెండర్ల (transgender) రాకపై గ్రామ కమిటీలు నిషేధం విధిస్తూ తీర్మానాలు చేశాయి. దీంతో ట్రాన్స్​జెండర్ల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ విషయమై జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి (collector ila tripathi) మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. కలెక్టరేట్లో (Nizamabad Collectorate) గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ట్రాన్స్ జెండర్లు, ఆయా గ్రామాల సర్పంచ్​లతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Transgender Village Ban | ఇరువర్గాల వాదనలు విన్న కలెక్టర్​..

సిరికొండ(sirikonda) మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదంతాలపై కలెక్టర్ ఇరు వర్గాల వాదనలు విన్నారు. వివాహాది శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి సమయాల్లో ట్రాన్స్​జెండర్లు గ్రామాల్లోకి వచ్చి బలవంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే అనుచిత ప్రవర్తనతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచ్​లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

ట్రాన్స్​జెండర్ల వేషధారణలో కొంతమంది నకిలీలు సైతం వస్తున్నారని, వారి వల్ల మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. అందువల్లే గ్రామస్తుల ఏకాభిప్రాయం మేరకు వారి రాకపై నిషేధం విధిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ బహిష్కరణ నిర్ణయాల వల్ల తాము గ్రామాలకు వెళ్లలేకపోతున్నామని, తమ గౌరవానికి భంగం కలుగుతోందని, జీవనోపాధి కోల్పోయామని ట్రాన్స్​జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేషధారణలో కొంతమంది నకిలీలు వ్యవహరిస్తున్న అసంబద్ధ వైఖరి కారణంగా తమపై ఆంక్షలు విధించడం భావ్యం కాదని ఆవేదన వెలిబుచ్చారు.

Transgender Village Ban | సయోధ్య కుదిర్చిన పాలనాధికారి..

ఇరువర్గాల వాదనలు విన్న మీదట కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో సయోధ్య కుదిర్చారు. నకిలీల బెడదను నివారించేందుకు అర్హత కలిగిన వాస్తవంగా ట్రాన్స్ జెండర్లు అయిన వారికి సమగ్ర నిర్ధారణ చేసి జిల్లా సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ ఐడీల ద్వారా నకిలీలను సులభంగా గుర్తిస్తూ, వారి బెడదను నివారించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రాన్స్​జెండర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు బలవంతపు వసూళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, ఇష్టపూర్వకంగా ఇచ్చినది తీసుకోవాలని ట్రాన్స్​జెండర్లకు హితవు పలికారు. సమాజంలో అనేకమంది ట్రాన్స్ జెండర్లను శివసత్తులుగా కొలుస్తూ.. తమకు తోచిన మేరకు డబ్బులు ఇస్తుంటారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.

Transgender Village Ban | ప్రవర్తన మార్చుకుంటామన్న ట్రాన్స్​జెండర్లు

ఇకపై ఎక్కడ కూడా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయవద్దని కలెక్టర్​ ట్రాన్స్​జెండర్లకు సూచించారు. ఇందుకు వారు అంగీకరిస్తూ, ఇకపై తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాలలో వారి రాకపై నిషేధం విధిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించి, ఆంక్షలను ఎత్తివేసేందుకు సర్పంచ్​లు అంగీకరించారు. ఎంతో సున్నితమైన సమస్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవ చూపి తనదైన శైలిలో పరిష్కరించడం పట్ల ట్రాన్స్​జెండర్లు, సర్పంచ్​లు జిల్లా పాలనాధికారికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో డీపీవో శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, డీడబ్ల్యూవో పద్మ, ఏవో రాజబాబు, డీఎల్పీవోలు, ట్రాన్స్​జెండర్లు, ఆయా గ్రామాల సర్పంచ్​లు పాల్గొన్నారు.

meeting

ఇది కూడా చదవండి: India Africa Summit|ఎబోలా ఎఫెక్ట్.. భారత్-ఆఫ్రికా సదస్సు వాయిదా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *