అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ajmer Jail Warden Arrest | రాజస్థాన్ (Rajasthan)లోని అజ్మీర్‌లో అత్యంత సంచలనం సృష్టించిన ఘటనలో మాజీ జైలర్ దివ్య చౌదరి అరెస్తయ్యారు. మహిళా ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి తన సొంతింట్లో పనులు చేయించుకున్న ఈ కేసులో.. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశేషం ఏమిటంటే, ఒకప్పుడు జైలర్‌గా అధికారం చెలాయించిన ఆమె, ఇప్పుడు అదే జైలులో ఖైదీగా ఊచలు లెక్కబెట్టాల్సి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Ajmer Jail Warden Arrest | అసలు ఏం జరిగింది?
2026 జూలై 12న అజ్మీర్ మహిళా జైలు ఇన్‌చార్జిగా ఉన్న దివ్య చౌదరి, మహిళా గార్డు సోనియా చౌదరితో కలిసి జీవిత ఖైదు అనుభవిస్తున్న కిరణ్, సానా అనే ఇద్దరు ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా బయటకు తీసుకెళ్లారు. జైలు రికార్డుల్లో ఎలాంటి వివరాలు నమోదు చేయకుండా, ప్రైవేట్ వాహనంలో వారిని అజ్మీర్‌లోని ఏఆర్‌జీ సిటీలో ఉన్న తన ఫ్లాట్‌కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆ ఖైదీలతో ఇల్లు శుభ్రం చేయించడం వంటి పనులు చేయించారు. ఖైదీలను బయటకు తీసుకెళ్లడాన్ని జైలు ప్రధాన ద్వారం వద్ద ఉన్న మహిళా సిబ్బంది వ్యతిరేకించగా, జైలర్ దివ్య , సోనియా వారిని బెదిరించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ ఇద్దరు ఖైదీలను తిరిగి జైలుకు పంపించారు.
Ajmer Jail Warden Arrest | ప్రత్యేక బృందం గాలింపు ..
ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టిన అధికారులు.. దివ్య చౌదరితో పాటు మహిళా గార్డు సోనియాను సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్ తర్వాత విచారణకు హాజరుకాకుండా ఇద్దరూ పరారయ్యారు. దీంతో ఆగస్టు 5న అజ్మీర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. సైబర్ సెల్ సాయంతో మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు , సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కోటాలోని ఓ ఫ్లాట్‌లో ఉన్న దివ్య ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ ఘటన జైళ్ల నిర్వహణలో ఉన్న లోపాలను, అధికారుల దుర్వినియోగాన్ని తీవ్రంగా ఎత్తిచూపుతోంది.
ఇది కూడా చదవండి..: Flight Ticket Price Hike | పెరిగిన విమాన ధరలు.. నేటి నుంచే అమలు