అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Alprazolam Drug Bust | రాష్ట్రంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. గంజాయి, కొకైన్, అల్ప్రాజోలం వంటి మాదకద్రవ్యాలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. తాజాగా ఈగల్ ఫోర్స్ అధికారులు కోళ్ల ఫారంలో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.
తెలంగాణ ఈగల్ ఫోర్స్ (Eagle Force) మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ పరిసరాల్లోని ఒక కోళ్ల ఫారంలో దాడులు చేపట్టింది. గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న అల్ప్రాజోలం డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 1.150 కిలోల అల్ప్రాజోలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.20.30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ప్రధాన నిందితుడు జయప్రకాశ్గౌడ్ను అరెస్ట్ చేశారు.
Alprazolam Drug Bust | కల్తీ కల్లు తయారీకి..
కల్తీ కల్లు తయారీ కోసం ఈ డ్రగ్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ తయారు చేసిన అల్ప్రాజోలంను కల్లు డిపోలకు సరఫరా చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 23 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు. కాగా గతంలో బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్లో అల్ప్రాజోలం తయారు చేసిన కేసులో జయప్రకాశ్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత.. బుద్ధి మార్చుకోకుండా మళ్లీ దందా ప్రారంభించాడు. ఈ సారి తన స్వగ్రామంలోని కోళ్ల ఫారంలో అక్రమంగా అల్ప్రాజోలం తయారు చేయడం ప్రారంభించాడు. అయితే అతడిపై నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్ దాడి చేసి అదుపులోకి తీసుకుంది.
దీనిని కూడా చదవండి : Nagaland Landslide | నాగాలాండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురి మృతి