అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalvakuntla Kavitha | సూపర్ ఎల్నినో వస్తుందని ఏడు నెలల క్రితమే వాతావారణ నిపుణులు హెచ్చరించారని, అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎల్నినో ఉన్నా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయలేదన్నారు. ఇప్పటికే మన దగ్గర 40 శాతం లోటు వర్షపాతం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నదిపై ఉన్న 57 రిజర్వాయర్లలో 418 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంటే 93 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. దీంతో సాగునీరు కాదు.. తాగునీళ్లకు దిక్కులేని పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వానికి నీళ్లు, వ్యవసాయం మీద ఏ మాత్రం సోయి లేదన్నారు.
Kalvakuntla Kavitha | అందుకే పార్టీ పెట్టా
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉండగా కొత్త పార్టీ అవసరముందా అని చాలా మంది అనుకుంటున్నారని కవిత అన్నారు. ఆ పార్టీలు మనకు కావాల్సిన పనులు చేసుంటే కొత్త పార్టీ అవసరం లేకుండే అన్నారు. తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ పార్టీలో జరిగిన అవినీతి సహా ఇతర అంశాల గురించి పార్టీలో చెప్పానని పేర్కొన్నారు. ఎప్పుడైతే నేను అవినీతి సహా బీసీల గురించి మాట్లాడటం మొదలుపెట్టానో తనపై కుట్ర చేశారని ఆరోపించారు. కొన్ని గుంటనక్కలు ఓర్వలేక కుట్ర చేసి తనను బయటకు పంపాయన్నారు. దీంతో చాలా మందితో మాట్లాడి కొత్త పార్టీ పెట్టినట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ప్రకటించారు.
Kalvakuntla Kavitha | బీఆర్ఎస్లోకి వెళ్లను
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోకి వెళ్లేది లేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నది జలాల విషయంలో ఏమాత్రం సోయి లేని ముఖ్యమంత్రి పాలనలో ఉండటం తెలంగాణ చేసుకున్న దురదృష్టం అన్నారు.
దీనిని కూడా చదవండి : England vs India ODI | ఇంగ్లాండ్ భారీ స్కోర్.. భారత్ లక్ష్యం 388 పరుగులు