అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Anganwadi Nutrition Program | అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని, వారిని ప్రతి రోజూ కేంద్రాలకు పంపించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
Anganwadi Nutrition Program | ప్రాథమిక పాఠశాలలో తనిఖీ
అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ (Collector Garima Agrawal) ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన యూనిఫాంలు వేసుకున్న విద్యార్థులతో మాట్లాడారు. గణితం, ఇతర అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యతను గర్భిణులు, బాలింతలు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ తల్లిదండ్రులు బాధ్యతగా ఆర్నెళ్లపాటు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారిఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని స్పష్టం చేశారు. త్వరలో ఎనిమియా ముక్త్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సర్పంచులు అంగన్వాడీ కేంద్రాల్లో పరిశీలించాలని, సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోషకాహారం అందేలా చూడాలని సూచించారు.
Anganwadi Nutrition Program | తల్లులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి
రక్తహీనతతో ఉన్న మహిళలు ప్రతి ఆర్నెళ్లసారి ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆర్బీఎస్కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆస్పత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్యసేవలు అందిస్తారని వెల్లడించారు. అలాగే కరీంనగర్లో ఎన్ఆర్సీ కేంద్రంలో సేవలు అందిస్తారని, ఉన్నత వైద్య సేవలు హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ మహేష్ రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజి రెడ్డి, సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నిర్మల, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహశీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో లచ్చాలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sammakka Sagar Barrage | ‘సమ్మక్క సాగర్’కు ఎన్వోసీ ఇవ్వండి : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి