అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sammakka Sagar Barrage | ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటి నిల్వకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో భేటీ అయ్యారు. బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ప్రభుత్వం తెలిపింది.
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 83 మీటర్ల వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే ఈ ప్రాజెక్ట్‌తో ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే బ్యారేజీలో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
Sammakka Sagar Barrage | ఎల్‌నినో నేపథ్యంలో..
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం ఆయనకు వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Rythu Bharosa | రైతు భరోసా వచ్చేనా.. అన్నదాతల నిరీక్షణ