అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Sanjay Congress | ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి తలపెట్టిన ఆందోళనలు కేవలం రాజకీయ డ్రామాలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ను ప్రజలు ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదని, కేవలం రాజకీయ నాటకాలతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ తీరు వల్లే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతోందని వ్యాఖ్యానించారు.
Bandi Sanjay Comments | చర్చకు రావాలని సవాల్..
రాహుల్ గాంధీపై ( Rahul Gandhi )తాము దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని, ప్రధాని నివాసం ముందు ధర్నా పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. నీట్ (NEET) వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే డ్రామాలు కట్టిపెట్టి చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Bandi Sanjay Comments | సర్కార్ తీరుపై విమర్శలు..
మరోవైపు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చేస్తున్న ధర్నాలు పెద్ద జోక్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని రేవంత్ అనడం విడ్డూరంగా ఉందని, రాహుల్ ప్రధాని కావడం దేవుడెరుగు.. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కూడా కల అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగునీరు అందక రైతులు అల్లాడుతుంటే ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ఫెయిల్ కావడంతో ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ సర్కార్ ఈ నిరసన డ్రామాలకు తెరదీసిందని ఆరోపించారు. ఇకనైనా ఆందోళనలు ఆపి, రైతుల పంటలకు సాగునీరందించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Vikram-1 Success | ‘విక్రమ్-1’ విజయంలో సత్తా చాటిన ఇందూరు యువకుడు..