అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bathukamma Filmmakers Challenge | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026 నిర్వహిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy) సూచించారు.
బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు సంబంధించిన పోస్టర్లను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. షార్ట్‌ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఛాలెంజ్ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. విజేతలకు రూ.3 లక్షల బహుమతి అందిస్తామని పేర్కొన్నారు.
Bathukamma Filmmakers Challenge | విజయవంతం చేయాలి
బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఛాలెంజ్ దోహదపడుతుందని మంత్రి తెలిపారు. యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Bathukamma Filmmakers Challenge | ఛాలెంజ్ వివరాలు..
ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే వారు తెలంగాణ ప్రజా పాలనలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలపై పాటలు, షార్ట్ఫిలిమ్స్ తీసి పంపాలి. షార్ట్ ఫిలిం 3 నిమిషాల నిడివి ఉండాలి. పాటలు 5 నిమిషాలు ఉండొచ్చు. ఎంట్రీలను ఈ నెల 15 లోపు పంపాల్సి ఉంటుంది. youngfilmmakerschallengrers@gmail.com, 8125834009 (వాట్సాప్)కు ఎంట్రీలు పంపాలి. నిపుణుల కమిటీ వీటిని పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది. మొదటి బహుమతి రూ.3 లక్షలు, రెండో బహుమతి రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.లక్ష ఇస్తారు. కన్సోలేషన్ బహుమతుల కింద ఐదుగురికి రూ.20 వేల చొప్పున అందిస్తారు.
దీనిని కూడా చదవండి : KTR Arrest | కేసీఆర్‌ను చంపే ప్రయత్నం : కేటీఆర్