అక్షరటుడే, వెబ్డెస్క్: BSF Bus Accident | అసోం రాష్ట్రంలోని బార్పేటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు Bud.. ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. జాతీయ రహదారి-27పై హౌలీ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. 32 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీఎస్‌ఎఫ్ సిబ్బందితో బస్సు ధుబ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుకు వెళ్తున్న ట్రక్కును బస్సు బలంగా ఢీకొనడంతో పలువురు సిబ్బంది గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
BSF Bus Accident | 14 మందికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 14 మంది పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వారిని బార్పేటా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (బీఎంసీహెచ్)కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గాయపడిన సిబ్బందికి కూడా వైద్య సహాయం అందించినట్లు తెలిసింది.
BSF Bus Accident | ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి
ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సంసుల్ హక్ (42) ప్రాణాలు కోల్పోయాడు. ఆయన గోల్‌పారా జిల్లాలోని షిమ్లిటోలా పరిధిలో ఉన్న గరోయిమారి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ట్రక్కును బస్సు ఢీకొన్న సమయంలో ప్రమాదం తీవ్రత కారణంగా ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న హౌలీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. బస్సు ట్రక్కును ఢీకొట్టడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వాహనాల వేగం, రహదారి పరిస్థితులు, ప్రమాదానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న భద్రతా సిబ్బంది బస్సు ప్రమాదానికి గురికావడంతో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. గాయపడిన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.