అక్షరటుడే వెబ్డెస్క్: Business Loans Telangana AP | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వ్యక్తిగత వ్యాపార రుణాలు (Individual Business Credit) వేగంగా వృద్ధి చెందుతున్నాయి. చిన్న, సూక్ష్మ వ్యాపార సంస్థలు (Micro Enterprises) తీసుకునే రుణాల కంటే, పారిశ్రామికవేత్తలు తమ వ్యక్తిగత పేరు మీద తీసుకుంటున్న బిజినెస్ లోన్ల శాతమే గణనీయంగా పెరుగుతోందని ఒక తాజా నివేదిక వెల్లడించింది. ‘ట్రాన్స్యూనియన్ సిబిల్’ (TransUnion CIBIL) , ‘నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్’ (NSIC) సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. 2026 జూన్ నాటికి తెలంగాణలో మైక్రో బిజినెస్ రుణ బకాయిలు రూ.1.74 లక్షల కోట్లకు, ఆంధ్రప్రదేశ్లో రూ.1.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
Business Loans Telangana AP | మూడేళ్లలో 26% వార్షిక వృద్ధి..
గడిచిన మూడేళ్ల కాలంలో తెలంగాణలో వ్యక్తిగత వ్యాపార రుణాలు 26% వార్షిక కాంపౌండ్ వృద్ధి రేటు (CAGR) నమోదు చేయగా, ఏపీలో 25% వృద్ధి నమోదైంది. అదే సమయంలో సూక్ష్మ సంస్థలు (Micro Businesses) తీసుకున్న రుణాలు తెలంగాణలో 13%, ఏపీలో 11% మాత్రమే పెరిగాయి. దీనిని బట్టి వ్యాపారాల నిర్వహణకు , విస్తరణకు వ్యాపారులు తమ సొంత పేరు మీదే రుణాలు తీసుకునేందుకు ఎక్కువమొత్తంలో మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.
రెండు రాష్ట్రాల్లో 43 లక్షల మంది ‘మిస్సింగ్ మిడిల్’ పారిశ్రామికవేత్తలు..
సంస్థల పేరిట అధికారికంగా రుణాలు పొందే విభాగంలో రెండు రాష్ట్రాల్లోనూ భారీ అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.
తెలంగాణ: మార్చి 2026 నాటికి దాదాపు 19.6 లక్షల మంది వ్యాపారులు తమ వ్యక్తిగత పేరు మీద రుణాలు తీసుకుంటున్నప్పటికీ, సంస్థల పేరిట రుణం తీసుకోలేదు. వీరిలో 62% మంది మంచి క్రెడిట్ ప్రొఫైల్ కలిగి ఉండగా, 61% మందికి 730 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ (CIBIL Score) ఉంది.
ఆంధ్రప్రదేశ్: దాదాపు 23.8 లక్షల మంది పారిశ్రామికవేత్తలు సంస్థల పేరిట లోన్ తీసుకోలేదు. వీరిలో 57% మందికి రెండేళ్లకు పైగా బిజినెస్ క్రెడిట్ అనుభవం ఉండగా, సిబిల్ స్కోర్ కూడా మెరుగ్గా ఉంది.
ఈ వ్యాపారులను వ్యక్తిగత రుణాల స్థాయి నుండి అధికారిక సంస్థాగత (Enterprise-level) రుణాల వైపు మళ్లించడం ద్వారా వర్కింగ్ క్యాపిటల్, క్యాష్ క్రెడిట్ సదుపాయాలు లభించి వారి వ్యాపారాలు వేగంగా విస్తరిస్తాయని ఎన్ఎస్ఐసీ జోనల్ జనరల్ మేనేజర్ సురేష్ బాబు , ట్రాన్స్యూనియన్ సిబిల్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ ఏజాజ్ నజీర్ అభిప్రాయపడ్డారు.
Business Loans Telangana AP |ఆస్తి ఆధారిత రుణాలే ప్రధానం..
తెలుగు రాష్ట్రాల్లో ఆస్తుల పూచీకత్తుగా తీసుకునే రుణాలు (Loans Against Property – LAP) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణలో మొత్తం మైక్రో బిజినెస్ లోన్లలో ఎల్ఏపీ వాటా 53% కాగా, ఏపీలో 41%గా ఉంది. వ్యాపార విభాగానికి వస్తే.. తెలంగాణలో 33%, ఏపీలో 43% రుణాలు వర్తక రంగానికి (Trade) సంబంధించినవి కాగా, తయారీ రంగం వాటా 17% , 18%గా ఉంది. అలాగే బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలు (NBFCs) ఈ వ్యాపారులకు వాణిజ్య వాహనాలు, ఆస్తుల పూచీకత్తుపై పెద్దమొత్తంలో రుణాలు అందిస్తున్నాయి.
Business Loans Telangana AP | మెరుగైన రుణ క్రమశిక్షణ..
రుణాల లభ్యత పెరిగినప్పటికీ, రెండు రాష్ట్రాల్లోనూ రుణ చెల్లింపుల తీరు (Portfolio Quality) ఎంతో ఆశాజనకంగా ఉంది. 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణాలు తెలంగాణలో కేవలం 1.7% కాగా, ఆంధ్రప్రదేశ్లో 2.1% మాత్రమే ఉన్నాయి. ఏపీలో గత మూడేళ్లలో బకాయిల శాతం 53 బేసిస్ పాయింట్లు మెరుగుపడటం గమనార్హం.
Business Loans Telangana AP |జాతీయ స్థాయి చిత్రం..
జాతీయ స్థాయిలో జూన్ 2026 నాటికి మైక్రో బిజినెస్ రంగానికి రూ.29.6 లక్షల కోట్ల వాణిజ్య రుణాలు బకాయి ఉన్నాయి. ఇందులో రూ.19.1 లక్షల కోట్లు వ్యక్తిగత వ్యాపార రుణాలు కాగా, రూ.10.5 లక్షల కోట్లు సూక్ష్మ సంస్థల రుణాలు. దేశవ్యాప్తంగా వ్యక్తిగత రుణాల విభాగం 21% సిఏజిఆర్ (CAGR) వృద్ధి నమోదు చేసింది.
ఇది కూడా చదవండి: Temple Dispute | దళితులు వర్సెస్ వీడీసీ.. ఆలయ నిర్మాణంపై కొనసాగుతున్న సందిగ్ధత