CBSE Three Language Policy | త్రిభాషా విధానం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన త్రిభాషా విధానం అమలుపై సుప్రీంకోర్టు స్పందించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CBSE Three Language Policy | దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన త్రిభాషా విధానం అమలుపై సుప్రీంకోర్టు ( Supreme Court ) స్పందించింది. సీబీఎస్‌ఈ (CBSE) పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచి అమలు చేయాలనుకున్న మూడు భాషల విధానాన్ని మరో ఏడాది వాయిదా వేసి, 2027 నుంచి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని గురువారం సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. విద్యార్థులపై ఆకస్మిక భారాన్ని తగ్గించడంతో పాటు కొత్త విధానానికి అలవాటు పడేందుకు ఈ వెసులుబాటు ఉపయోగపడుతుందని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టు సూచనపై సీబీఎస్‌ఈ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సానుకూలంగా స్పందిస్తూ, దీనిపై పునరాలోచించి తాజా నోట్‌ను సమర్పిస్తామని తెలిపారు.

CBSE Three Language Policy | ధర్మాసనం పరిశీలన..

ప్రధాన కమ్యూనికేషన్స్ అండ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. కొత్త మూడు భాషల విధానాన్ని 2027 నుంచి అమలు చేసే విషయమై సీబీఎస్‌ఈ కసరత్తు చేయాలని సూచించింది. అయితే, ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మూడు భాషలు చదవాలనుకునే విద్యార్థులకు మాత్రం ఆ వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. మే 27న ఈ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీలకు గతంలోనే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

CBSE Three Language Policy | ఏంటి ఈ త్రిభాషా విధానం..?

జాతీయ విద్యా విధానం-2020 (NEP 2020) , నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ (NCF-SE 2023) మార్గదర్శకాలకు అనుగుణంగా సీబీఎస్‌ఈ తన విద్యా విధానంలో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా 9వ తరగతి విద్యార్థులు మూడు భాషలు అభ్యసించడం తప్పనిసరి కాగా, అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలని నిబంధన పెట్టింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సంస్కృతం తదితర ప్రాంతీయ/భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి స్థానికేతర భాషలను ఇందులో పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఈ మార్పుల అమలుపై సీబీఎస్‌ఈ కోర్టుకు సమర్పించనున్న తాజా నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి:  Pakistan Drone Deal | పాక్ ఆర్మీ డ్రోన్ డీల్.. తెరపైకి ట్రంప్ కుమారుల పెట్టుబడులు..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *