అక్షరటుడే, వెబ్డెస్క్: Cheyutha Pension Scheme | తెలంగాణ Telangana రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు, ఆపన్నుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మరో 4.5 లక్షల మంది అర్హులకు ప్రభుత్వం కొత్తగా ఆసరా (చేయూత) పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసే ప్రక్రియ కొనసాగనుంది.
Cheyutha Pension Scheme | ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని
మంజూరు పత్రాలు అందుకున్న నూతన లబ్ధిదారులందరికీ మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీన నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ కానుంది.
Cheyutha Pension Scheme | 5.73 లక్షలు దాటిన కొత్త లబ్ధిదారుల సంఖ్య
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా అర్హులైన పేదలకు పింఛన్లను మంజూరు చేస్తోంది. తాజాగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లతో కలిపి రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల మొత్తం సంఖ్య 5,73,625కు చేరుకుంది.
Cheyutha Pension Scheme | మహిళలు, బలహీన వర్గాలకు పెద్దపీట
సమాజంలో ఆర్థికంగా వెనుకబడి, ఆధారం కోల్పోయిన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులతో పాటు ఒంటరి మహిళలకు ఈ కొత్త పింఛన్ల మంజూరులో ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఏ ఒక్క అర్హుడూ నష్టపోకుండా పారదర్శకంగా ఈ పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త పింఛన్ల మంజూరు పత్రాలు అందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..