CMR Scam | మిల్లర్ల మాయాజాలం.. రూ.కోట్ల విలువైన ధాన్యం మాయం

Balla Sandeep Kumar

అక్షరటుడే, డిచ్​పల్లి: CMR Scam | కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్​ చేసి.. ఎఫ్​సీఐకి బియ్యం అప్పగించాల్సిన మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సీఎంఆర్​ అందించడంలో మాయజాలం చేస్తున్నారు. ధాన్యం, బియ్యం పక్కదారి పట్టించి రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. సీఎంఆర్​ బకాయిలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

సీఎంఆర్ కేటాయింపుల్లో భారీ అక్రమాలు వెలుగుచూడటం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించి, రైస్ మిల్లులకు అప్పగించిన సన్నధాన్యం మిల్లుల్లో కనిపించకుండా పోవడం వెనుక పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు స్పష్టమవుతోంది. ధాన్యాన్ని మరాడించి (మిల్లింగ్ చేసి) పేదలకు అందించాల్సిన కొందరు రైస్ మిల్లర్లు, ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ రూ. కోట్లలో ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారు. మార్కెట్లో ధాన్యం ధర పెరగడం, పొరుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండటంతో.. సర్కారు ఇచ్చే ధాన్యాన్ని అక్రమంగా తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

CMR Scam | తనిఖీలకు ఆదేశం

ధాన్యాన్ని సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెడుతూ నిర్లక్ష్యం వహించడం, టెండర్ దక్కించుకున్న గుత్తేదారులకు బియ్యం అప్పగించకపోవడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ తనిఖీలకు ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడంతో రైస్ మిల్లర్లలో వణుకు మొదలైంది. ఉమ్మడి జిల్లా ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ వందలాది రైస్ మిల్లులు నిరంతరం కార్యకలాపాలు సాగిస్తుంటాయి. కానీ గత కొన్ని సీజన్లుగా ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ బకాయిలు చెల్లించడంలో అనేక మిల్లులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి.

CMR Scam | ఒక్క మిల్లులోనే రూ.66.12 కోట్ల కుంభకోణం

నిజామాబాద్ (Nizamabad) రూరల్ మండలం కాలూరులోని శ్రీ సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్​లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. 2022-23 రబీ నుంచి 2025-26 రబీ సీజన్ వరకు సుమారు 20,368 మెట్రిక్ టన్నులు ధాన్యం మిల్లు గోడౌన్ల నుంచి మాయమైనట్లు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ. 66.12 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ధాన్యాన్ని యాజమాన్యం పక్కదారి పట్టించిందని అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు.

CMR Scam | పేరుకుపోయిన బకాయిలు

జిల్లాలోని సుమారు 50 కంటే ఎక్కువ రైస్ మిల్లులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిల్వల్లో భారీగా బకాయి పడి ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన వేలాది మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఇంకా మిల్లుల్లో ప్రాసెస్ కాకుండా ఉన్నట్లు కాగితాల్లో చూపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ స్టాక్ ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, దాన్ని మళ్లీ పాలిష్ చేసి ప్రభుత్వం ఇచ్చే సీఎంఆర్ కోటా కింద జమ చేసే రీ-సైక్లింగ్ ముఠాలు జిల్లాలో చురుగ్గా పనిచేస్తున్నాయనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.

CMR Scam | కఠిన చర్యలు అవసరం

బియ్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లులపై ‘ఆర్ఆర్ యాక్ట్’ (రెవెన్యూ రికవరీ యాక్ట్) కింద కేసు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేయాలి. బకాయిలు చెల్లించని రైస్ మిల్లులకు రాబోయే సీజన్లలో ధాన్యం కేటాయింపులను వెంటనే నిలిపివేయాలి. విజిలెన్స్ దాడులతో భయాందోళన చెందుతున్న పలువురు మిల్లర్లు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో అధికార పార్టీ నాయకులు, మిల్లర్ల సంఘం రాష్ట్ర ప్రతినిధుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఈ తనిఖీలను నిలిపివేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ దూకుడు పెంచుతుండటం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Bhavesh Mishra | బాధ్యతలు స్వీకరించిన ఇన్​ఛార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *