Collector Bhavesh Mishra | బాధ్యతగా పనిచేయకపోతే సరెండర్​ చేస్తా: కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం పనిచేయవద్దని.. వారికి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని నిజామాబాద్​ కలెక్టర్​ భవేష్​ మిశ్రా అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Collector Bhavesh Mishra | ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం పనిచేయవద్దని.. వారికి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్​ భవేష్​ మిశ్రా సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత శాఖల ఉన్నతాధికారుకు సరెండ్​ చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్​లో జలసిరి, హౌసింగ్, వన మహోత్సవం, డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు.

Collector Bhavesh Mishra | ‘జలసిరి’పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఎల్​నినో వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న ప్రస్తుత తరుణంలో జలసిరి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విస్తృత స్థాయిలో ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్ తదితర నిర్మాణాలు జరిపించాలని కలెక్టర్​ సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు జరగని మండలాల ఎంపీడీవోలపై కలెక్టర్ (Collector Bhavesh Mishra) ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చొరవ చూపాలని, క్షేత్రస్థాయిలో రైతులను, ప్రజలను కలిసి అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించే వారిని సరెండర్ చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. కేవలం జీతాల కోసం పని చేయకూడదని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును వృథా కాకుండా కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యతను గుర్తెరిగి అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.

Collector Bhavesh Mishra | వయనాడ్​లో లోటు వర్షపాతం నమోదు

నైరుతి రుతుపవనాలు మొట్టమొదటగా ప్రవేశించే కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా సాధారణంతో పోలిస్తే 44 శాతం లోటు వర్షపాతం నెలకొందన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నీటి సంరక్షణకు ఉపయుక్తంగా నిలిచే ఫాంపాండ్స్, సోక్ పిట్స్ వంటి వాటిని విరివిగా నిర్మించేలా చూడాలన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోయి నీరు అందించక వృథాగా ఉన్న బోరు బావుల వద్ద వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో వీటి నిర్మాణాల వల్ల 5 నుంచి 10 అడుగుల మేరకు భూగర్భ జలాల వృద్ధి చెందాయని, ఇక్కడ కూడా అలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు చొరవ చూపాలన్నారు.

Collector Bhavesh Mishra | వన మహోత్సవ లక్ష్యాలను చేరుకోవాలి..

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలు నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నాటిన మొక్కలను ఈనెల 29న ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటకుండా తప్పుడు నివేదికలు సమర్పించిన వారి నుంచి నిధుల రికవరీ చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సమీక్షిస్తూ, సెప్టెంబర్ 15లోపు పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని గడువు విధించారు. జాబ్ కార్డులు కలిగి ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు వీబీజీరాంజీ కింద వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేయాలని సూచించారు.

ప్రభుత్వం నుంచి కేటాయించబడే నిధులు పూర్తిస్థాయిలో వినియోగం అయ్యేలా చొరవ చూపాలన్నారు. గుడిసెలలో నివసిస్తున్న కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు లబ్ధిదారుల జాబితా రూపొందించాలని, రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన వారికి కేటాయించేందుకు వీలుగా లబ్ధిదారుల జాబితాను తక్షణమే తహశీల్దార్లకు సమర్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేష్, డీఆర్​డీవో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్ రావు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Pocharam Project | కనువిందు చేస్తోన్న ‘పోచారం’.. పోటెత్తుతున్న పర్యాటకులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *