Cyber Crime Hyderabad | రోజుకు రూ.కోటి కొట్టేస్తున్న సైబర్​ నేరగాళ్లు

హైదరాబాద్​ నగరంలో సైబర్​ నేరగాళ్లు సగటును రోజుకు రూ.కోటికి పైగా కాజేస్తున్నారని సీపీ సజ్జనార్​ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime Hyderabad | కష్టార్జితాన్ని సైబర్‌ నేరగాళ్ల చేతిలో పెట్టి మోసపోవద్దని, విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ (VC Sajjanar)​ సూచించారు. సిటీ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ నేరాలు (Cyber Frauds) కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయని తెలిపారు. నగరంలో ఏడాదిలో దొంగతనాలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాల రూ.30 కోట్ల నష్టం వాటిల్లితే.. ఒక్క సైబర్ నేరాల రూపంలోనే బాధితులు ఏకంగా రూ.400 కోట్లకు పైగా కోల్పొతున్నార‌ని తెలిపారు. అంటే సగటున రోజుకు రూ.కోటికి పైగా ప్రజల సొమ్ము కేటుగాళ్ల ఖాతాల్లోకి మళ్లుతోందన్నారు.

Cyber Crime Hyderabad | డిజిటల్​ అరెస్టుల పేరిట

సీనియర్ సిటిజన్లను డిజిటల్ అరెస్టులు, పింఛను సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ పేరిట మోసం చేస్తున్నారని సీపీ తెలిపారు. సీబీఐ (CBI), ఈడీ, ఆర్‌బీఐ లేదా పోలీసు అధికారులమని చెప్పి డిజిటల్ అరెస్ట్ (Digital Arrest) పేరిట బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. మన చట్టాల్లో గానీ, పోలీసు వ్యవస్థలో గానీ ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానమే లేదని స్పష్టం చేశారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు, ట్రేడింగ్ లింక్‌లను చూసి మోసపోవద్దన్నారు.

Cyber Crime Hyderabad | వెంటనే ఫిర్యాదు చేయాలి

ఇంట్లోని పిల్లలు పెద్దల ఫోన్లలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లలో సభ్యత్వం తీసుకోవడం వల్ల కూడా పెద్దల రిటైర్‌మెంట్ సొమ్ము మాయమవుతుందంటూ సీపీ తెలిపారు. బ్యాంకింగ్ వివరాలు, పిన్‌ నంబర్లు, ఓటీపీలను కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే తక్షణమే స్పందించి గోల్డెన్ అవర్​లో 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. వెంటనే సమాచారం ఇస్తే సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

దీనిని కూడా చదవండి : Bandi Sanjay | ఢిల్లీలో బండి సంజయ్‌ నివాసానికి ఈటల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.